భూత్పూర్, మే 16: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీదేవి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి కి ప్రపంచ సుందరాంగులు రావడాన్ని అడ్డుకుంటారనే ఉద్దేశంతో ప్రభుత్వం చైతన్య మహిళా సంఘం సభ్యులను ముందస్తుగానే అరెస్టు చేసింది. పోలీసులు శుక్రవారం తెల్లవారుజామునే మహిళా సంఘాల సభ్యులను అరెస్టు చేసి పాలమూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ కు, అక్కడినుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు అనంతరం భూత్పూర్ పోలీస్ స్టేషన్లో ఉంచారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ పథకాలైన రైతు బంధు రైతు బీమా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్య ఉందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం, ఇలాంటి పరిస్థితుల్లో రూ. 500 కోట్లతో ప్రపంచ సుందరంగులతో మన రాష్ట్రంలో కార్యక్రమాన్ని నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. వారికి ప్లేట్ భోజనం లక్ష రూపాయలు పెట్టడం అవసరమా అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన అని చెప్పడమే తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేసే పాలన కాదని ఆమె దుయ్యబట్టారు.