గద్వాల/అయిజ, ఆగస్టు 11 : జూరాల ప్రాజెక్టుకు వరద మళ్లీ పెరిగింది. ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద తరలిరావడంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టులోని 8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 32,312 క్యూసెక్కులను విడుదల చేశారు. అయితే జూ రాలకు ఇన్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులు ఉండ గా, అవుట్‌ఫ్లో 77,746 క్యూసెక్కులు నమోదైంది. విద్యుదుత్పత్తికి 40,537 క్యూసెక్కు లు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు గరిష్ఠనీటి మట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.89 మీటర్ల నీటి మట్టం ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.396 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. మంగళవారం టీబీ డ్యాం కు ఇన్‌ఫ్లో 39,569 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,630 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం గరిష్ఠ స్థాయి నీటి మట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1626.82 అ డుగుల నీటిమట్టం ఉండగా, 105.788 టీ ఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తు తం 82.599 టీఎంసీల నీటి నిల్వ ఉందని డ్యాం సెక్షన్ అధికారి కిరణ్ తెలిపారు.
శ్రీశైలం, ఆగస్టు 11 : శ్రీశైల జలాశయానికి వరదనీటి ప్రవాహం కొనసాగుతుంది. మంగళవారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 40,537 క్యూసెక్కులు, క్రస్ట్‌గేట్ల ద్వారా 32,312 క్యూసెక్కులు, మొత్తంగా 72,849 క్యూసెక్కుల నీరు విడుదల కాగా సాయంత్రానికి 52,916 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వచ్చి చేరుకున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.80 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 181.83 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
పెబ్బేరు, ఆగస్టు 11 : వారం పది రోజులుగా జోరుమీద సాగిన కృష్ణానది ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో పెబ్బేరు మండలం రంగాపురం వద్ద కృష్ణానది పరవళ్లు మందగించాయి. ఎగువ రాష్ర్టాల నుంచి వరద రాక తగ్గడంతో జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదలను అధికారులు నియంత్రించారు. మంగళవారం కేవలం ఎనిమిది గేట్లు మాత్రమే ఎత్తి నీటిని వదలడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు తక్కువ స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగింది.