ఈ లైన్లో మరిన్ని రైళ్లు తిరిగేలా..
పెరగనున్న వేగం, సాఫీగా ప్రయాణం
పాలమూరు వరకు ఎంఎంటీఎస్ నడపాలని డిమాండ్
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఫలక్‌నుమా-మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులు చివరి దశకు చేరాయి. మార్చి చివరి నాటికి పనులు పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఫలక్‌నుమా- గొల్లపల్లి, మహబూబ్‌నగర్-దివిటిపల్లి మధ్య డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. దివిటిపల్లినుంచి గొల్లపల్లి మధ్య ముమ్మరంగా జరుగుతున్నాయి. త్వరగా డబుల్ ట్రాక్‌ను సిద్ధం చేసి రైళ్లను నడిపించేలా పనులు సాగుతున్నాయి. మరిన్ని కొత్తవి కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. దీంతోప్రయాణం మరింత సాఫీగా సాగనున్నది. పాలమూరునుంచి కాచిగూడకు కేవలం గంటలోనే చేరుకునే అవకాశం ఉన్నదని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.
అకోలా-డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా ఫలక్‌నుమా-మహబూబ్‌నగర్ మధ్య చేపట్టిన డబ్లింగ్ పనులు మార్చి చివరి నాటికి దాదాపుగా పూర్తి కానున్నాయి. ఈ మేరకు రైల్వే అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఫలక్‌నుమా-గొల్లపల్లి మ ధ్య డబ్లింగ్, విద్యుద్దీకరణ పూర్తవగా.. ఇటీవల మహబూబ్‌నగర్-దివిటిపల్లి మధ్య కూడా పనులు పూర్తయ్యాయి. కాగా, దివిటిపల్లి నుంచి గొల్లపల్లి మధ్య మా త్రమే జరుగుతున్న పనులను మార్చి చివరి నాటికి పూర్తి చేసి.. సాధ్యమైనంత త్వరగా రైళ్ల రాకపోకలకు డబుల్ ట్రాక్‌ను సిద్ధం చేయాలని చూస్తున్నట్లు దక్షిణ మధ్య రై ల్వే అధికారులు తెలిపారు. డబ్లింగ్ పూర్తయితే మహబూబ్‌నగర్ నుంచి కాచిగూడకు కేవలం గంటలో చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మరిన్ని రైళ్లను మహబూబ్‌నగర్ వరకు నడిపే వీలవుతుంది.
ఆది నుంచి శీతకన్ను..
రైల్వే లైన్ల కేటాయింపు, నిధుల విడుదలలో ఆది నుంచి దక్షిణాదికి అన్యాయమే జరుగుతున్నది. ఎప్పటి నుంచో సింగిల్ లైన్, డీజిల్ ఇంజన్లకే పరిమితమైన తెలంగాణలోని అనేక రైల్వే లైన్లపై కేంద్రం శీతకన్ను వేస్తూ వచ్చింది. 2015-16లో రూ.774 కోట్లతో రైల్ వికాస్ నిగం లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) చేపట్టిన సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్, విద్యుదీక్దరణ పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. ప్రస్తుతం బడ్జెట్లో రూ.150 కోట్లు కేటాయించడంతో ఎలాగైనా ఈసారి డబ్లింగ్ పూర్తి చేయనున్నట్లు రైల్వే ప్రయాణికుల సంఘం ప్రతినిధులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ఉందానగర్ వరకు ఎం ఎంటీస్ విస్తరణలో భాగంగా ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు 28 కి.మీ. మేర డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు పూర్తి చే శారు. షాద్‌నగర్-గొల్లపల్లి వరకు 29 కి.మీ. మేర సెప్టెంబర్ 16, 2020 నాటికి డబ్లింగ్ పనులు పూర్తికాగా.. ఆ తర్వాత ఉందానగర్-షాద్‌నగర్ మధ్య మిగతా పనులు సైతం పూర్తి చేశారు. దీంతో సికింద్రాబాద్-గొల్లపల్లి వరకు 88 కి.మీ. మేర పనులు పూర్తై గతేడాది ఆగస్టు నుంచి రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం దివిటిపల్లి- గొల్లపల్లి మధ్య పనులు జరుగుతున్నాయి.
పెరగనున్న సదుపాయాలు..
సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మార్గంలో డబ్లింగ్ పనులతోపాటు స్టేషన్లలో సౌకర్యాల కల్పనకు రైల్వే శాఖ పెద్దపీట వేస్తున్నది. అధునాతన స్టేషన్ భవనాలు, ఆధునిక వసతులు, నూతన ప్లాట్‌ఫారాలు, ఫుట్ఓవర్ బ్రి డ్జీలు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. కొత్తగా వేసిన ట్రాక్‌తోపాటు అప్పటికే ఉన్న దానిపై గంటకు 130 కిలోమీటర్ల వేగంతో 25 టన్నుల యాక్సిల్ లోడ్ రైళ్లు, గూడ్స్ ప్రయాణించేలా తీర్చిదిద్దారు. మహబూబ్‌నగర్ నుంచి సి కింద్రాబాద్ వరకు 113 కి.మీ దూరానికి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చేరుకునేందుకు గతంలో 1:40 గంటలు పడితే.. ఇప్పుడు 1:10 గంటల్లో చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్యాసింజర్ రైళ్లకు రెండు గంటలు పట్టనున్న ది. డబ్లింగ్ పూర్తయితే మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య లోకల్ రైళ్లు తిప్పే అవకాశం ఉంటుంది. ఉందానగర్ స్టేషన్ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ పెరుగుతుంది.
డబ్లింగ్, విద్యుద్దీకరణతో ప్రయోజనాలు..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ముఖ్యమైన సికింద్రాబాద్-డోన్ రైల్వే మార్గం డబ్లింగ్ పనుల్లో ఓ అడుగు ముందుకు పడింది. మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య ఉన్న 113 కిలోమీటర్ల రైల్వే మార్గంలో ఇప్పటికే 88 కి.మీ. మేర డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు పూర్తై రైళ్లు కూడా తిరుగుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కొ త్త లైన్లో రైళ్ల వేగాన్ని 130 కి.మీ.కు పెంచారు. దీంతో సకాలంలో గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశం ఏర్పడింది. ప్రయాణికులకు క్రాసింగుల ఇబ్బందులు తీరనున్నాయి. మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ మార్గంలో మరో 25 కి.మీ. మార్గంలో పనులు జరుగుతుండగా.. ఇటీవలే మ హబూబ్‌నగర్-దివిటిపల్లి మధ్య 10.45 కి.మీ. మేర డబుల్ ట్రాక్, విద్యుద్దీకరణ పనులు పూ ర్తయ్యాయి. రైల్వే సేఫ్టీ అధికారులు సైతం ఈ ట్రాక్‌పై ట్రయల్ రన్ పూర్తి చేశారు. మొదట గూ డ్స్ రైళ్లను నడిపి తర్వాత ప్యాసింజర్ రైళ్లను అనుమతించనున్నారు. దివిటిపల్లి-గొల్లపల్లి మధ్య 15 కి.మీ. పరిధిలో పనులు జరుగుతున్నాయి. వీటిని మార్చి నెలాఖరు వరకు పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి షాద్‌నగర్-గొల్లపల్లి వరకు డబుల్ లైన్లో రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. మిగతా పనులు పూర్తయితే సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు, అనంతపురం, కడప, తిరుపతి, చెన్నై మొదలైన ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ మరింత మెరుగుపడనున్నది.
ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలి..
మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు చివరి దశకు వచ్చాయి. ఈ పనులు పూర్తయ్యాక ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి, నాంపల్లి వరకు నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను మహబూబ్‌నగర్ వరకు పొడిగించాలి. దీంతో మహబూబ్‌నగర్, జడ్చర్ల, బాలానగర్, షాద్‌నగర్, కొత్తూరు, ఉందానగర్ తదితర పట్టణాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ప్రయోజనకరంగా మారనున్నది. కేవలం గంటలో కాచిగూడ చేరుకోనుండడంతో హైదరాబాద్ నగరంపై జనాభా ఒత్తిడి కూడా తగ్గుతుంది. కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్‌కు అదనపు రైళ్లు వేయడంతో కూడా ఈ ప్రాంత ప్రయాణికులకు మేలు కలగనున్నది. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్‌తోపాటు డోన్- మహబూబ్‌నగర్ పనులు కూడా త్వరగా చేపట్టి పూర్తి చేస్తే కాచిగూడ నుంచి చెన్నై, తిరుపతి, బెంగళూరుకు దగ్గరి మార్గం అందుబాటులోకి వస్తుంది.
– గోపాల్, డీఆర్‌యూసీసీ మెంబర్, దక్షిణ మధ్య రైల్వే