మహబూబ్‌నగర్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మద్యం షాపుల వద్ద పల్లి బఠానీలు అమ్మే దందా కోసం పర్మిట్ రూములను బంద్ చేసిన ఘటన మరువకముందే.. దేవరకద్ర నియోజకవర్గంలో ఏ కంగా ఎమ్మెల్యే పేరు చెప్పి వైన్షాపుల్లోనూ వాటా ఇవ్వాలని దౌర్జన్యం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గత వారం రోజులుగా ఆ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో కాంగ్రెస్ మండల నేతలు పర్మిట్ రూము లకు తాళాలు వేయించినట్లు ఆరోపణలు వినిపి స్తున్నాయి. వైన్ షాపుల్లో 30శాతం వాటా ఇవ్వా లని డిమాండ్ చేస్తున్నట్లు మద్యం వ్యాపారులు అంటున్నారు. రూ.లక్షలు ఖర్చుపెట్టి… లక్కీ డిప్లో వైన్ షాపులు దక్కించుకున్న వ్యాపా రులు అధికార పార్టీ నేతల దౌర్జన్యాలతో బెం బేలెత్తిపోతున్నారు.
ఈ విషయాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించు కో వడంలేదని వ్యాపారులు వాపో తున్నారు. ఈ నియోజక వర్గంలో 8 మండలాల్లో 5 మండలాలు జాతీయ రహదారిపై ఉన్నా యి. ఏడాది పొడవునా ఫు ల్లుగా మద్యం వ్యాపా రాలు జరుగుతుంటా యి. ఇక బెల్టు షాపుల సంగతి సరేసరి. ఈ జాతీయ రహ దా రికి ఆనుకొని ఉన్న మండలంలో ఓ నేత ఏకంగా రెం డు వైన్ షాపుల్లో 30 శాతం వాటా కావాలని పట్టు బట్టినట్లు సమాచారం.
ఇది వినకపోవడంతో ఎక్సైజ్ అధికారులతో ఏకంగా పర్మిట్ రూ ములను మూయించారు. ఇక ఎమ్మెల్యే సొంత మండలంలో కూడా పార్టీలు మారుతూ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఓ మండలం నేత తనకు కూడా వాటా కావాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో వ్యాపారులంతా ఆందో ళనకు గురవుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా లో వైన్ షాపుల దందాల్లో చిల్లర కొట్టు రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు పార్టీ పరువు తీస్తున్నారని సీని యర్లు వాపోతున్నారు.
దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు తమకు వాటాలు ఇవ్వని వైన్ షాపుల దగ్గర ఉన్న పర్మిట్ రూములకు ఎక్సైజ్ అధికారులతో తాళాలు వేయించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా కాంగ్రెస్ నేతల ఒత్తిడితో అధికారులు తలొగ్గినట్లు వ్యాపారులు అంటున్నారు. ఒక్కో వైన్ షాపు వద్ద పర్మిట్ రూమ్ కోసం ఎక్సైజ్ శాఖకు ఏడాదికి రూ.ఐదు లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా ఇటు పోలీసులకు అటు ఎక్సైజ్ అధికారులకు మామూలు ఇవ్వకుంటే వ్యాపారాలు నడపడం కష్టమేనని ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతల బెదిరింపులతో హడలెత్తిపోతున్నారు.
ఒకవైపు వాటాలు కావాలని కొంతమంది వస్తుంటే మరోవైపు అక్కడ ఉన్న పల్లీ బఠానీలు, మినరల్ వాటర్, నాన్‌వెజ్ కౌంటర్లు తమ కార్యకర్తలకు ఇవ్వాలని మరికొందరు బెదిరిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాల వద్ద మా నాయకులు, కార్యకర్తలకే ఇచ్చారు. ఇక్కడ ఇవ్వడానికి మీకేమైందీ? అంటూ వ్యాపారులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ అధికారులను అడ్డం పెట్టుకొని బెదిరించి పర్మిట్ రూముల వద్ద చిరు వ్యాపారాలను సొంతం చేసుకున్న కాంగ్రెస్ నాయకుల వ్యవహారం ఉమ్మడి జిల్లా అంతా పాకుతుందని వ్యాపారులు అనుకుంటున్నారు. తమ దగ్గర బెదిరిస్తున్న విషయం మిగతా నియోజకవర్గాల్లో కూడా కొంతమంది వైన్ షాపులు దక్కని వారు కావాలని ప్రచారం చేస్తుండడంతో అక్కడి వ్యాపారులు కూడా బెంబేలెత్తుతున్నారు.
దేవరకద్ర నియోజకవర్గంలో మద్యం వ్యాపారులు వాటా ఇవ్వకుంటే వ్యాపారాలు ఎలా చేస్తారు చూస్తామంటూ రోజుకో నాయకుడు వచ్చి అల్టిమేట్ ఇస్తున్నట్లు వ్యాపారులు ‘నమస్తే తెలంగాణ’తో వాపో తున్నారు. ముందుగా ఒకరిద్దరు నేతలతో తాము మాట్లాడుతుంటే మిగతా నేతలు వచ్చి వాళ్లేనా మేము లేమా అంటున్నారు. దీంతో ఎవరితో ఒప్పందాలు చేసుకోవాలో ఎవరిని బతిమాలాలో తెలుసు కోలేక సతమత మవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ నేతల బెదిరింపులతో ఇక వైన్స్ వ్యాపారులు సిండికేట్‌గా మారి మద్యం ప్రియులకు ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ అమ్మినా ఆశ్చర్య పోవా ల్సిన అవసరం లేదని అంటున్నారు. కొన్నిచోట్లా పర్మిట్ రూములకు తాళాలు వేయడంతో మద్యం ప్రియులు రోడ్లపైన తాగి తందానా లాడుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కోని ఇలాంటి దందాలకు చెక్ పెట్టాలని.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోరుతున్నారు.