వనపర్తి, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలోని పౌర సరఫరాల శాఖ అవినీతిలో కూరుకు పోయింది. గడిచిన ఐదారేళ్లుగా రూ. కోట్లు అడ్డగోలుగా మూటగట్టుకుంటున్న కొంద రు అధికారుల బాగోతం ఎప్పుడో ఒకసారి బయట పడుతుంది. ఇటీవలే పౌరసరఫరాల శాఖ డీఎం జగన్మోహన్ రూ.లక్షా 70 వేలు డి మాండ్ చేసి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇలా అధికారుల తీరు ఉంటే.. మిల్లర్ల వ్యవహారం తక్కువేం లేదు. ఏ మిల్లు పరిశీలించినా రూ.కో ట్ల ధాన్యం బొక్కలు వెలుగు చూస్తుండడంతో విస్మయం కలిగిస్తున్నది. చివరకు పౌర సరఫరాల శాఖలో దొంగలెవరో.. దోషులెవరో అన్న ట్లు జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తున్నది.
వనపర్తి జిల్లాలో 175 మిల్లులు
వనపర్తి జిల్లాలో 175 రైస్ మిల్లులు ఉండగా.. వీటిలో 10 వరకు పారా బాయిల్డ్ మిల్లులు ఉంటే.. మిగితావన్నీ నార్మల్ మిల్లులే. సాగునీటి వనరులు పెరిగిన అనంతరం జిల్లాలో
అధిక మొత్తంలో వరి విస్తీర్ణం పెరిగింది. అధికారులు ఎంతలా వద్దని వారించినా రైతులు వినే పరిస్థితి లేదు. దీంతో ఏడాదికేడాది రైతులు వరి సాగుకే ఎక్కువ మొగ్గు చూపుతూ వస్తున్నారు. ఇతర పంటల సాగులో ఎక్కువ పని ఉంటుందని, వరి పనిలో నాటు వేస్తే పైపైన చూసుకోవచ్చన్న తరహాలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో ప్రతి సీజన్లో వరి పంట 3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా దిగుబడి వస్తుంది.
మింగేస్తున్న మిల్లర్లు..
ప్రజాధనాన్ని కొందరు మిల్లర్లు అప్పనంగా మింగేస్తున్నారు. పైరవీలతో రూ.లక్షలు అధికారులకు తినిపిస్తూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. గడచిన ఐదేండ్లుగా ఈ దోపిడీలో ను వ్వు ముందా.. నేను ముందా..? అన్నట్లు వ్యా పారం ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’గా కొనసాగుతోంది. నిజాయితీగా నడిచే వ్యవస్థను మూలకు చేర్చి అడ్డగోలు వ్యాపారానికి సీఎంఆర్ రూపంలో దారులు తెరిచారు. దీనికి అధికారులు వంతపాడటం.. అవసరం తీరిన అనంత రం ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరించడం కూడా పరిపాటిగా మారింది. వానకాల సీజన్‌కు అన్ని సక్రమంగా ఉన్న మిల్లులను మాత్రమే పారదర్శకంగా ఎంపిక చేశామని జిల్లా అధికారి చెప్పిన రెండు రోజులకే ఖిల్లాఘణపురం మండ లం సోలీపూర్‌లో రైస్ మిల్లుపై విజిలెన్స్ తనిఖీలు జరిగాయి. ఈ మిల్లు కూడా ఇప్పుడు ధా న్యం కేటాయించిన వాటిలో ఉన్న ది. అన్ని సక్రమంగా ఉన్న మిల్లులకే ధాన్యం కేటాయించామ ని అధికారులు చెప్పిన వాటిలోనే ఇలా తప్పులు బయటపడుతుంటే పారదర్శకం అన్నమాటకు అర్థం లేకుండా పోయింది. ఎన్ని కేసులవుతు న్నా అవినీతి ఆగకపోవడం కొసమెరుపు. అవి నీతి అధికారులు రంగంలోకి దిగినా భయం కనిపించడం లేదు.
పెరిగిన పరిశ్రమలు..
వరి శిస్తు పెరగటాన్ని గమనించిన వ్యాపారులు జిల్లాలో రైస్ మిల్లుల ఏర్పాటుపై దృష్టి సారించారు. గతంలో 100 వరకు మిల్లులుంటే.. తక్కువ సమయంలోనే 175 మిల్లులు అయ్యాయి. ప్రతి సంవత్సరం కొత్తగా పదిలోపు మిల్లులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే.. సొంతంగా వ్యాపారం చేసి మిల్లులు నడిపే యజమానులు చాలా తక్కువనే చెప్పాలి. అంతా ప్రభుత్వం సీఎంఆర్ ధాన్యంపైనే ఆధారపడి పోటాపోటీగా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని ఏర్పాటు చేసినా సీఎంఆర్‌ను నిబంధనల పేరుతో కేవలం కొన్ని మిల్లులకే పరిమితం చేస్తూ వస్తున్నారు. చేతులు తడిపిన మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయింపులు ఇస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. వారికి ఇష్టం లేని మిల్లులను తప్పుల పేరుతో తప్పించి మరో కొత్త నాటకానికి తెర లేపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో పండించిన ధాన్యాన్ని వివిధ రకాల పేర్లతో పక్క జిల్లాలకు తరలించి కమీషన్లకు ఎగబడుతున్నారన్న గుసగుసలు లేకపోలేదు. ఇతర జిల్లాలకు తరలించినఒక్కో బస్తాకు రూ.3 నుంచి రూ.5 వరకు వసూలు చేస్తున్నట్లు టాక్.
మంట గలుస్తున్న ప్రతిష్ట
వనపర్తి కొత్త జిల్లా ఏర్పాటైన అనంతరం అభివృద్ధిలో దూసుకుపోయింది. జిల్లాకు తొలి కలెక్టర్‌గా వచ్చిన శ్వే తా మొహంతి, తొలి ఎస్పీగా పని చేసి న రోహిణి ప్రియదర్శిని ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. అధికార యంత్రాంగాన్ని పని చేయించడంలో పరుగులు పెట్టించారు. పని చేసే వారిని ప్రోత్సహిస్తూ.. పని చేయని వా రికి చుక్క లు చూపించారు. జిల్లాలో ఈ అధికారులున్నం త వరకు కొందరికి నిద్ర పట్టేదికాదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. ఒక ఏడాది గడువులో జిల్లాలో దాదాపు పదిలోపు ఏసీబీ కేసుల్లో లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడటం చర్చనీయాంశమైంది. రోజురోజుకూ అవినీతి ఇంకా మితిమీరుతోంది. ఇటీవలే జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్ ఏసీబీ చిక్కిన సంగతిని జ నం ఇంకా మరిచి పోలేదు.
ఇది జరిగి పట్టుమని నెల రోజులు కూడా కాలేదు. మళ్లీ అదే కలెక్టరేట్లో పౌరసరఫరాల శాఖ డీఎం జగన్ మోహన్ ఏకంగా రూ.50 వేలు పుచ్చుకొని అవినీతి నిరోధకశాఖ ఉచ్చుకు చిక్కారు. అలాగే ఇదే కేసులో డీఎస్వో కాశీవిశ్వనాథ్తోపాటు అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్‌ను విచారణ చేశామని, అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ చెప్పడంతో అసలు కలెక్టరేట్లో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్న ది. వీటికి ముందే సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ రైడింగ్ చేసి నివేదికను విచారణకు పంపిం ది.
అలాగే ఆ ర్టీవో కార్యాలయంపై నిఘా ఉంచిన క్రమం లో పలుమార్లు దా డులకు యత్నించిన ట్లు చర్చ ఉన్నది. ఏసీ బీ చప్పుడైనప్పుడల్లా డబ్బాలను మూ యిం చి, ఆ తర్వాత తెరిపించి యథావిధిగా నడుస్తున్న తతంగాన్ని ఎవరికి తెలియదన్నట్లుగా చేస్తుండటాన్ని ప్రజ లు నిశితంగానే గమనిస్తున్నారు. రూ.వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ఇలా అడ్డదారుల్లో రూ.లక్షల అక్రమ సంపాదనకు తెరలేపిన వారంతా కటకటాలు లెక్కించాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఇటీవలే అవినీతి మరింతగా పెరిగి జిల్లాకు గతంలో ఉన్న మంచి పేరును మంటగలుపుతూ చెడ్డపేరును అపాదిస్తుందన్న వాదనలు లేకపోలేదు. లంచాలు స్వీకరించడంలో వనపర్తి నెంబర్‌వన్ అన్నట్లుగా చరిత్రకు ఎక్కుతుండటం దురదృష్టకరం.