మహబూబ్‌నగర్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు విడుతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పునాదులను కదిలించాయి. అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు నువ్వా..నేనా.. అనే రీతిలో పోటీపడ్డారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ తీసుకువచ్చిన ఘనత కూడా బీఆర్ఎస్ కే దక్కింది. స్వల్ప ఓట్ల తేడాతో అనేక స్థానాలను కోల్పోయింది. తొలి విడుత ఫలితాలతోనే గుబులు రేగిన కాంగ్రెస్ నేతలు నోరు పారేసుకుంటున్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏకంగా పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడటం.. ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరించడం మొదలుపెట్టారు. అయినా పల్లె జనం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. గద్వాల నారాయణపే జిల్లాలో కూడా అధికార పార్టీకి గట్టి పోటీని ఇచ్చింది. ఎన్ని ప్రలోభాలు పెట్టినా గ్రామాల్లో గులాబీ దూకుడును ఆపలేకపోయారు. మంత్రి జూపల్లి ఇలాకాలో ఏకంగా 30 స్థానాలను కైవసం చేసుకుని వణుకు పుట్టించింది. జడ్చర్ల, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో కూడా కారు స్పీడును ఆపలేకపోయారు.
దేవరకద్ర ఎమ్మెల్యే సొంత ఊరిలో బీఆర్ఎస్ విజయం ఊపునిచ్చింది. వనపర్తి జిల్లాలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ సొంత ఊరిలో బీఆర్ఎస్ మద్దతుతో ఇండిపెండెంట్‌ను గెలిపించారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, గద్వాల ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు సమిష్టి కృషితో పంచాయతీ ఎన్నికల్లో గులాబీ ప్రభంజనాన్ని సృష్టించారు. పాలమూరు జిల్లాలో పోటాపోటీగా స్థానాలు గెలిపించుకొచ్చిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు అభినందించారు.
బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులకు దిగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు విడుతల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్డుకట్ట వేసి బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించడంతో అదుపు తప్పిన అధికార పార్టీ నేతలు నోరు పారేసుకుంటున్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఏకంగా బీఆర్ఎస్ సర్పంచులు గెలిచి క్యాంప్ ఆఫీస్‌కి వస్తే గెంటేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతు దారులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ సహనం కోల్పోతున్నారు. వాళ్ల ప్యాంట్లో తొండలను వదులుతా వీళ్ల ప్యాంట్లో తొండలు వదులుతా అంటూ హుంకరిస్తున్నా రు. నారాయణపేట డీసీసీ మాజీ అధ్యక్షుడు అభివృద్ధిపై నిలదీసిన కార్యకర్తలను చీరీ పారేస్తా.. అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మిగతా ఎమ్మెల్యేలు ప్రచారానికి వెళ్లి బీఆర్ఎస్కు ఓటేస్తే అభివృద్ధి ఆపేస్తామని.. ఆ గ్రామానికి నిధులు ఇవ్వమని.. ఇండ్లు రావని సీఎం రిలీఫ్ ఫండ్స్ అస్సలు ఇవ్వమని చెబుతున్నారు.
అంబరాన్నంటిన సంబురాలు..
బెదిరింపులు బ్లాక్‌మెయిలింగ్ ప్రలోభాలకు లొంగకుండా బీఆర్ఎస్ గెలుస్తుండడంతో గ్రామాల్లో సంబురాలు చేసుకుంటున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే స్వగ్రామంలో బీఆర్ఎస్ గెలవడంతో దాదాపు మూడు గంటల పాటు భారీ ర్యాలీ తీయడం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడికి వెళ్లినా ఇదే చర్చ నడుస్తోంది. వనపర్తి ఎమ్మెల్యే సొంత గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థితో నువ్వా నేనా అనే రీతిలో టైట్ ఫైట్ జరిగింది. స్వల్ప ఓట్లతో గట్టెక్కారు. మేజర్ గ్రామపంచాయతీల్లో కూడా పల్లె ప్రజలు కేసీఆర్‌కే పట్టం కట్టారు. దీంతో గ్రామాల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అధికార యంత్రాంగాన్ని పోలీసు యంత్రాంగాన్ని విచ్చలవిడిగా వాడినప్పటికీ బీఆర్ఎస్ గెలుపును ఆపలేకపోయారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చారిత్రాత్మక గెలుపును గులాబీ దళం కైవసం చేసుకుంది.
రెండు విడుతల్లో 388 పంచాయతీలు కైవసం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 11న, 14న జరిగిన రెండు విడుతల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. మొదటి విడుతలో 173 స్థానాలు, రెండో విడుతలు 215 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నది. ఉప సర్పంచుల్లో కూడా మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. వార్డు స్థానాల్లో కూడా హవా కొనసాగించింది. కొన్నిచోట్లా బీఆర్ఎస్ మద్దతు దారులు గెలవడంతో కాంగ్రెస్ నేతలు డీలా పడిపోయారు. స్వల్ప ఓట్ల తేడాతో దాదాపు మరో 50 స్థానాలను బీఆర్ఎస్ కోల్పోయింది. కొన్నిచోట్ల మేజర్ గ్రామపంచాయతీలను కైవసం చేసుకుని కాంగ్రెస్‌ను మట్టి కల్పించింది. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సర్పంచ్ క్యాండిడేట్ బీఆర్ఎస్ మద్దతు దారుడు కావడం విశేషం. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర నేతల స్వగ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారు లు గెలవగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రణాళికా సంఘం వైస్ ప్రెసిడెంట్ డీసీసీ అధ్యక్షుల స్వగ్రామాలను బీఆర్ఎస్ గెలిచి రావడంతో సంబురాలు అంబరాన్నంటాయి. ఖిల్లాఘణపురం మండలంలో ఓ గ్రామంలో ఓటమిపాలైన కాంగ్రెస్ నాయకుడు ఎలక్షన్లో పంచిన డబ్బులను తిరిగి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
చివరి విడుత కూడా అదే జోష్‌లో..
ఉమ్మడి జిల్లాలో చివరి విడుత ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. చివరి విడుతలో కీలకమైన మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రచారంతో హోరేత్తించారు. అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా ప్రచారంలో దూసుకు పోయారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా గులాబీ నేతలకు ఘన స్వాగతం లభిస్తున్నది. ఇక ఓటమిని జీర్ణించుకోలేని అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. క్యాండిడేట్లను కొనే పనిలో పడింది. అయినా ఎక్కడా లొంగడం లేదు. మొదటి రెండు విడుతల్లో బీఆర్ఎస్ విజయాలు చివర విడుత ఎన్నికలకు ఊపునిస్తున్నాయి. మొత్తం పైన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటడంతో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.