వెల్దండ, జనవరి 6 : దొంగలు బీభత్సం సృష్టించి, 16 ఇండ్లల్లో చోరీ చేసిన ఘటన వెల్దండ మండలం కొట్రలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది. దొంగలు ఏకంగా 16 ఇండ్లల్లో చోరీకి పాల్పడి అందిన కాడికి దోచుకెళ్లారు. స్థానికుల వివరాల ప్రకారం.. వెల్దండ మండలం కొట్ర గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు తాళాలు వేసిన ఇండ్లలోకి చొరబడ్డారు. ఏకంగా 16 ఇండ్ల తాళాలు విరగ్గొట్టి దొరికిన కాడికి దోచుకెళ్లారు. మరి కొన్ని ఇండ్లల్లో చోరీకి విఫలయత్నం చేశారు. గ్రామానికి చెందిన కడారి పార్వతమ్మ, కొడుకు గణేశ్‌తో కలిసి ఉప్పునుంతల మండలం తిప్పాపూర్‌లోని తన కూతురి ఇంటికి మనువడి పుట్టిన రోజు వేడుకలకు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. అదే వి ధంగా కవాటి కృష్ణయ్య తన భార్య ఇటీవల మృ తి చెందడంతో కొన్ని రోజులు ఇల్లు వదిలి వెళ్లాలని పురోహితులు చెప్పగా వారు ఇంటికి తాళం పెట్టి వేరే ఇంట్లో ఉంటున్నారు. దీంతో పార్వతమ్మ ఇంటి తాళం విరగ్గొట్టిన దుండుగులు బీరువాను పగులగొట్టి అందులో ఉన్న రూ.3.80 లక్షల నగదు, 4.5గ్రాముల బంగారం, 10 తులాల వెండి, కావటి కృష్ణయ్య ఇంట్లో రెండు బీరువాలు పగులగొట్టి 2 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. తిర్మన్దాస్ సరోజనమ్మ ఇంట్లో రూ. 11వేలు, నత్తి లింగయ్య ఇంట్లో రూ.4 వేలు, కావటి తిరుపతయ్య ఇంట్లో రూ.10 వేలు, 20 తులాల వెండి, ముంగళిశెట్టి జంగమ్మ ఇంట్లో రూ.6 వేలు, తులం బంగారం, ముంగళిశెట్టి వెంకటయ్య ఇంట్లో 20 తులాల వెండి, బూత్కురి యాదమ్మ ఇంట్లో రూ.2వేలు, మాధవులు ఇంట్లో 14 తులాల వెండి అపహరించుకుపోయారు. గ్రామస్తులు పోలీసులకు స మాచారం ఇవ్వగా వెల్దండ సీఐ సోమనర్సయ్య, ఏఎస్సై కుమారస్వామి క్లూస్ టీం సాయం తో చోరీ జరిగిన ఇండ్లలో నమూనాలు సేకరించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.