గద్వాల, అక్టోబర్ 26 : ప్రభుత్వ ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.. కానీ 10వ బెటాలియన్ కానిస్టేబుల్ ఉద్యోగమంటేనే హడలిపోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు నెలలు భార్యాపిల్లలను వదిలి వెళ్లాల్సిందే. కుటుంబంలో ఎవరికైనా ఆపదొచ్చినా పట్టించుకునే నాథుడుండడు. రెండు, మూడేండ్లకు ఒక పా ఠశాల మారాల్సి వస్తున్నది. ఏ రాష్ట్రంలో ఎక్కడ విధు లు నిర్వహించడానికి అధికారులు పంపిస్తారో తెలియని పరిస్థితి. పండుగ లేదు, పబ్బం లేదు. నిరంతరం విధులు నిర్వహించాల్సిందే. ఒకవేళ అధికారులకు ఎదురు మాట్లాడితే ఇంక్రిమెంట్ పెండింగ్. దీ నికి తోడు అధికారుల ఇంట్లో వెట్టిచాకిరి. ఇదేమని ప్ర శ్నిస్తే వేధింపులు.
చివరికి బెటాలియన్‌లో పనిచేసే కా నిస్టేబుళ్లకు పిల్లని ఇవ్వాలంటే ఆలోచించే దుస్థితి నెలకొన్నది. ఏ శాఖలోనైనా ప్రమోషన్ వస్తే జీతంతోపా టు హోదా పెరుగుతుందని అందరూ భావించగా, ఇ క్కడ మాత్రం ప్రమోషన్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఎర్రవల్లి 10వ బెటాలియన్‌లో 650 మంది విధు లు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 250 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 70 మంది హెడ్‌కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. వారిని సెక్యూరిటీ కోసం ఎప్పుడు ఎక్కడ విధులకు పంపుతారో తెలియదు. దీంతో వారి పిల్లలను చదివించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు.
త మ పిల్లల చదువులకు ఏడాదిలో నాలుగు పాఠశాలలు మా ర్చాల్సిన పరిస్థితి నెలకొందని కానిస్టేబుళ్ల కుటుంబాలు వా పోతున్నాయి. దీంతో పిల్లల భవిష్యత్‌కు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో అందుబాటులో లేని కారణంగా తల్లిదండ్రులు, భా ర్యాపిల్లలకు ఆపద వస్తే చూసుకోలేని పరిస్థితి. కనీసం భార్య డెలివరీ సమయంలో కూడా వారి వద్ద ఉండి ధైర్యం చెప్పే పరిస్థితి లేదు. గతంలో 15 రోజులు పనిచేస్తే నాలుగు రోజు లు సెలవులు ఇచ్చేవారు. ప్రస్తుతం 26 రోజులు చేస్తే నాలు గు రోజులు ఇవ్వడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరీక్ష సమయంలో సివిల్, ఏఆర్, బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఒకే రకమైన పరీక్ష విధానం ఉన్నప్పుడు తమపై ఎందుకు ఇంత వివక్ష అంటూ ప్రశ్నిస్తున్నారు. వారికి ఇచ్చే వెసులుబాటు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
హెడ్‌క్వార్టర్స్‌లో ఉండాలనుకునే వారిని ఉన్నతాధికారులు పిట్టిక్ పేరుతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. మైదానంలో గడ్డి తీయడం, గుంతలు తవ్వడం, బిల్డింగ్ కట్టడాల్లో వినియోగించుకోవడం, ఆర్డర్లీ విధానంలో అధికారుల ఇంట్లో పనిచేయడం వంటివి చేయిస్తున్నారు. వీటన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదువుకున్న చదువుకు చేసే ఉద్యోగాలకు ఎటువంటి పొంతన లేకుండా పోతున్నది. పండుగలకు 10రోజుల ముందే ఎవరూ సెలవు పెట్టకూడదని రూల్స్ పెడతారు. కంపెనీల్లో బెటాలియన్ పోలీసులకు అందించే మెస్ విషయంలో అక్రమాలు చోటు చేసుకుంటుండడంతో సరైన భోజనం అందడం లేదు. కంపెనీల్లో ఉండే మెస్ విధానం రద్దు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
నెలల తరబడి నా భర్త ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడం వల్ల పిల్లలు తండ్రి ప్రేమకు దూరమవుతున్నారు. ఎప్పుడు ఇంటికి ఫోన్ చేసినా డాడీ ఇంటి ఎప్పుడొస్తావని అడగటమే. మాకు ఇక్కడ ఎవరూ తెలియదు. మా ఆయన డ్యూటీపై ఇతర రాష్ర్టాలకు వెళ్తే ఏదైనా ఆపద వస్తే ఆదుకునే వారుండరు. ఏక్ పోలీస్ విధానంలో సంవత్సరమా లేదా రెండేండ్లు ఒకే చోట స్థిరనివాసం ఉండేలా చర్యలు తీసుకోవాలి.
– వాణిశ్రీ
ఏడాదిలో రెండు, మూడు ప్రాంతాలకు డ్యూటీలు మారుస్తున్నారు. ఎక్కడ ఉంటే అక్కడికి కుటుంబంతో వెళ్లాల్సి వస్తున్న ది. తమ పిల్లలను ఎక్కడ చదివించుకోవాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మాత్రం ఐదేండ్లు ఒకే చోట చదివితే లోకల్ అంటున్నది. మరి ఏడాదికి రెండు చోట్ల మా పిల్లలు చదివితే మేం ఎక్కడ లోకల్ అని చెప్పాలి. బెటాలియన్ కానిస్టేబుళ్లు అంటే పెండ్లికి పిల్లను ఇవ్వడానికి భయపడుతున్నారు.
– శైలజ
నా కొడుకు ఎర్రవల్లి బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. నాకు అనారోగ్య సమస్యలున్నాయి. ఓ కన్ను బాగా కనిపించదు. కోడలితో కలిసి ఉంటున్నా. నాకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే చూయించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోడలు, పిల్లలతో కలిసి వెళ్లాలంటే కుదరదు. నా మనవరాలు డాడీ ఎప్పుడొస్తాడని ప్రతిరోజూ దీనంగా అడుగుతుంటుంది. ఏం చెప్పాలో తెలియని పరిస్థితి.
– ఎల్లమ్మ
బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్ల కుటుంబాల బాధలు ఎవరికీ చెప్పుకోలేనివి. భర్త ఉద్యోగం చేస్తున్నాడనే మాటే గానీ కుటుంబానికి దూరంగా ఉంటూ పిల్లలు మనోవేదనకు గురవుతున్నారు. ఒక చోట స్థిరంగా ఉండి ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. ఆపదలోనూ అండగా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఏదైనా శుభకార్యానికి వెళ్తే భర్త లేని లోటు బాధగా అనిపిస్తున్నది.
– అనూష