జడ్చర్లటౌన్, అక్టోబర్ 7 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో కమీషన్ ఏజెంట్లు, ఖరీదుదారుల మధ్య వివాదంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. ఈ తరుణంలో ఆకాల వర్షం కురియడంతో యార్డులో నిల్వ ఉంచిన మొక్కజొన్న, ధాన్యం తడిసిముైద్దెన ఘటన మంగళవారం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో చోటుచేసుకున్నది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం రైతులు మొక్కజొన్న, ధాన్యం పంట విక్రయానికి తీసుకొచ్చారు.
వాస్తవానికి ఉదయం 12గంటలలోపు టెండర్లు ప్రారంభంకావాల్సి ఉండగా, కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారుల మధ్య డబ్బుల చెల్లింపుల విషయంలో వివాదం తలెత్తింది. కమీషన్ ఏజెంట్లకు ఆలస్యంగా డబ్బులు చెల్లింపులు జరుగుతున్నాయని కమీషన్ ఏజెంట్లు తెలియజేస్తున్నారు. ఆలస్యంగా జరిగే చెల్లింపులకు వడ్డీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కమీషన్ ఏజెంట్లకు, ఖరీదుదారులకు మధ్య వివాదం నెలకొనడంతో మార్కెట్‌యార్డులో సమయానికి నిర్వహించాల్సిన టెండర్లు ప్రారంభం కాలేదు. మరో వైపు మార్కెట్‌యార్డులో తెచ్చిన పంటకు టెండర్లు కాకపోవటంతో రైతులు ఆందోళన చెందారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు టెండర్లు ప్రారంభంకాలేదని, అధికారులు సైతం పట్టించుకోవటంలేదని రైతులు మండిపడ్డారు. ఈ క్రమంలో మార్కెట్‌యార్డు ఎదుట రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న మార్కెట్‌యార్డు కార్యదర్శి అశ్వక్‌అహ్మద్, పాలకవర్గ సభ్యులు జొక్యం చేసుకొని కమీషన్ ఏజెంట్లు, ఖరీదుదారులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3గంటల తర్వాత టెండర్ల ప్రక్రియ మొదలైంది. టెండర్ల ప్రక్రియకు దాదాపు రెండు గంటల పాటు ఆలస్యం కావటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తడిసిన మొక్కజొన్న, ధాన్యం..
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు అకాల వర్షం కురియడంతో యార్డు ఆవరణలో నిల్వ ఉన్న మొక్కజొన్న, ధాన్యం తడిసి ముద్దయింది. టెండర్లు ప్రక్రియ ముగిసిన తర్వాత ఖరీదుదారుల కొనుగోలు చేసిన మొక్కజొన్న, ధాన్యం యార్డు ఆవరణలో నిల్వ చేశారు. ఒక్కసారిగా వర్షం కురియటంతో యార్డు ఆవరణలో నిల్వ ఉన్న ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయింది.