మక్తల్ : మక్తల్ మండలం గుర్లపల్లి గ్రామంలో కుక్కల దాడిలో (Dogs attack) పది గొర్రెలు( Sheeps) మృతి చెందగా మరో ఇరవై గొర్రె పిల్లలు గాయపడ్డాయి . బాధితులు వెంకటప్ప, నరేష్, ఎల్లప్ప అందించిన సమాచారం ప్రకారం .. రోజువారి మాదిరిగానే గొర్రె పిల్లలను గ్రామానికి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో చెట్టు దగ్గర ఇనుప గ్రిల్లో ఉంచి, గొర్రెలను మేతకు తీసుకెళ్లేవారమని తెలిపారు.
నిన్న రాత్రి ఇనుప గ్రిల్లో ఉన్న గొర్రె పిల్లల మందపై కుక్కలు దాడి చేసి పది గొర్రెలను చంపివేశాయని, మరో 20 గొర్రె పిల్లలను తీవ్రంగా గాయపరిచాయని ఆందోళన వ్యక్తం చేశారు. గొర్రెలే జీవనాధారంగా బ్రతుకుతున్న తమకు గొర్రెల మృతి బాధ కలిగిస్తుందని వాపోయారు. సంబంధిత అధికారులు కుక్కలను నియంత్రించే చర్యలను చేపట్టి గొర్ల కాపరులకు న్యాయం చేయాలని కోరారు.