నాగర్కర్నూల్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : పని కోసం ఉపాధికి వెళ్లే తల్లిదండ్రులు, ఉన్న ఊళ్లో ని బడి కంటే గురుకులాల్లో చదువులు బాగుంటా యి.., మంచి భోజనం దొరుకుతుంది.. మా పిల్లలు బాగా చదువుకొంటారని భావిస్తున్న తల్లిదండ్రులకు ఇటీవలి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సంబంధిత పాఠశాలల స్పెషల్ అధికారులు, ప్రిన్సిపాళ్ల నిర్లక్ష్యానికి తోడు సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ కరువై కలుషితాహారం తిని బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు.. ముందు ప్రాణాలతో ఉంటే చాలు అన్న చందంగా మార డం విచారకరం. నాగర్కర్నూల్ జిల్లాలోని వెల్దండ మోడ ల్ స్కూల్, తాజాగా పెంట్లవెల్లి కస్తూర్బాలోని సంఘటనలతో ఆయా విద్యాలయాల తీరుపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
గురుకులాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. గ్రామా లు, పట్టణాల్లో మండల, జిల్లా పరిషత్లాంటి ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో తీసుకున్న చర్యలతో పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటయ్యాయి. ఈ విద్యాలయాల్లో చదువు, భోజనం, వసతిలాంటి సౌకర్యాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నా యి. దీంతో ఆయా పాఠశాలలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలు, లక్కీడీప్ ఎంపికలకు ఉన్న సీట్లకంటే రెట్టింపు సం ఖ్యలో విద్యార్థుల నుంచి డిమాండ్ వస్తోన్న పరిస్థితులు ఉన్నాయి.
ఈ కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపించేందుకు తల్లిదండ్రులు, విద్యార్థులూ ఇష్టం చూపిస్తున్నారు. ఫలితంగా పూర్తిస్థాయి సీట్లతో ఆయా విద్యాలయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు భద్రత కల్పించేలా భవనాలతో కూడిన వసతులు అందుతున్నాయి. ఇక ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనంలో వివిధ రకాల వంటకాలు రుచికరంగా అందిస్తున్నారు. ఇక ఉపాధ్యాయులను కూడా పెద్ద ఎత్తున నియమించారు. దీనివల్ల విద్యార్థులకు ఈ పాఠశాలలు విద్యాలయాలుగా మారాయి. అలాంటి పాఠశాలలు ఇటీవల కాలంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు భయానకంగా మారుతున్నాయి.
గతంలో అచ్చంపేటలోని ఓ గురుకులంలో బాలిక మృతి చెందగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇదిలా ఉండగా తాజాగా వెల్దండలోని ఆదర్శ పాఠశాలలో భోజనం నాసిరకంగా ఉందని విద్యార్థులు భోజనం తినలేక ఆపసోపాలు పడ్డారు. 20మంది వరకు విద్యార్థులు రెండు రోజులపాటు కడుపు నొప్పితో బాధపడ్డారు. స్థానిక దవాఖానలో చూపించగా, మరికొందరికి కల్వకుర్తిలో చికిత్సలు చేయించారు. ఇది చూసిన తల్లిదండ్రులు కొందరు తమ పిల్లలను ఇండ్ల్లకు తీసుకెళ్లారు. పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సమస్య కూడా ఇబ్బంది కలిగిస్తోంది.
స్నానాల గదులు, మరుగుదొడ్లు కూడా సరిగ్గా లేవు. ఏఎన్ఎంలాంటి వైద్య సిబ్బంది కూడా లేరు. వంట సిబ్బంది తీరూ సరిగ్గా లేదు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన విద్యార్థులకు చికిత్స అందించడంలోనూ సంబంధిత పాఠశాల అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు రోదించడం గమనార్హం. ఈ సంఘటనలో తప్పు కేర్ టేకర్దేనని ప్రిన్సిపాల్ తెలిపారు. కాగా విద్యార్థులకు ఆహారం, అనారోగ్యం సోకితే తమ పిల్లలుగా భావించాల్సిన సిబ్బంది బాధ్యతల ప్రస్తావన తీసుకురావడం బాధ్యతారాహిత్యమనే అభిప్రాయాలు వినిపించాయి.
ఈ పాఠశాల సంగతి ఇలా ఉంటే.. పెంట్లవెల్లి కస్తూర్బాది మరీ అధ్వానం. ఈనెల 16న ఆదివారం కలుషిత ఆహారం తిని 18 మంది బాలికలు అనారోగ్యానికి గురయ్యారు. బాలికలు వాంతులు చేసుకోగా కొల్లాపూర్ దవాఖానకు తరలించి చికిత్సలు నిర్వహించారు. అదేరోజు రాత్రి ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థినులను కలిసి ఆరా తీశారు. మరుసటి రోజు నియోజకవర్గంలోని కస్తూర్బా పాఠశాలల విద్యార్థినులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించి, నిర్ల క్ష్యం వహించరాదని హెచ్చరించారు. మధ్యాహ్నం కలెక్టర్ సంతోష్ పాఠశాలకు వెళ్లి స్వయంగా బాలికలతోపాటుగా భోజనం చేశారు. అంతా మంచిగా ఉందనుకుంటే అదేరోజు సాయంత్రం భోజనాలు చేసిన తర్వాత మరో 15 మంది బాలికలతోపాటుగా ఇద్దరు ఉపాధ్యాయినులు వాంతులు చేసుకోవడం విశేషం.
ఈ సంఘటనతో విద్యార్థుల్లో మరింత ఆందోళన నెలకొంది. తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని విద్యార్థుల పరిస్థితి చూసి ఆవేదన చెందారు. పాఠశాలకు తీసుకొచ్చిన బియ్యం పాతవి కావడంతోపాటు నాసిరకమైన కూరగాయలు వండటంతో ఈ పరిస్థితి వచ్చిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆయా విద్యాలయాల్లో తక్కువ ధరకు దొరికే నాసిరకమైన కూరగాయలు, కాలం చెల్లిన బియ్యంతో చేసిన వంటకాలే ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. కాగా ఈ పాఠశాలలను తరచూ పర్యవేక్షించాల్సిన జిల్లా అధికారులు తమకేమీ ప ట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
దీనివల్ల సంబంధిత పాఠశాలల సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మంత్రి, కలెక్టర్ వచ్చాక కూడా పెంట్లవెల్లిలో అదే పరిస్థితి పునరావృతమవ్వడమే దీనికి నిదర్శంగా చెప్పవచ్చు. ఇలా రెండోసారి జరిగాక కస్తూర్బా ప్రత్యేక అధికారి స్వప్న, నలుగురు వంట సిబ్బందిని తొలగించడం విశేషం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అధికారుల తీరు ఉందని వి మర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు మంచి భో జనం, విద్యకోసం లక్షల్లో నిధులు వస్తుంటే నాణ్యమైన భోజనం, విద్యను అందించకుండా స్వాహా చేసేలా సిబ్బం ది ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది.