వనపర్తి, మే 3 : మండలంలోని చిట్యా ల తూర్పు తండాకు చెందిన రమేశ్ రూపొందించిన బంజారా క్రికెట్ అసోసియేషన్ లోగోను బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకుగానూ ప్రత్యేక చొరవ తీసుకొని క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. క్రీడాకారులకు ప్ర త్యేకంగా వేసవి శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రీడాకారులు వీటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేత
బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, ఉస్మానియా విద్యార్థి సంఘం నేత బత్తిని మద్దిలెట్టి తత్వశాస్త్రంలో పరిశోధన చేస్తున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితి కారణంగా పరిశోధనకు ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయకపోవడంతో ఈ విషయాన్ని పలువురు నాయకులు మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి సొంతం గా రూ.50 వేలతో ల్యాప్‌టాప్ కొనుగోలు చేసి బుధవారం మద్దిలెట్టికి మం త్రి అందజేశారు. కార్యక్రమంలో ఖిల్లా ఎంపీపీ కృష్ణానాయక్, నాయకులు పాల్గొన్నారు.