మరికల్ : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మరికల్ మండల బీజేపీ అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ విమర్శించారు. బుధవారం మరికల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని, రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ జరిగిందో తెలువని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
రైతు భరోసా మార్చి నాటికి కూడా అందే పరిస్థితి లేదని, ఉచిత విద్యుత్ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, ఇందిరమ్మ ఇండ్లను మండలంలో ఒకే గ్రామానికి కేటాయిస్తే మిగతా గ్రామాల పరిస్థితి ఏమిటని వేణుగోపాల్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గ్రామాల్లో ఒకరిద్దరికి మాత్రమే అందుతుందని అన్నారు.
ఆరు గ్యారంటీల అమలులో విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టిని మరలించేందుకే రాజీవ్ యువశక్తి పథకాన్ని తెరపైకి తెచ్చిందని చెప్పారు. సమావేశంలో మండలంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.