మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 7 : జిల్లాలో గతేడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రావాల్సిన రెమ్యూనరేషన్ డబ్బులు ఇప్పటి వరకు రాలేదు. మండు వేసవిలో అసౌకర్యాల మధ్య అష్టకష్టాలు పడుతూ పేపర్లు దిద్దినా.. చేసిన కష్టానికి చేతికందాల్సిన పారితోషికం అందకపోవడంతో ఏడాదిగా ఉపాధ్యాయులకు ఎదురుచూపులు తప్పడం లేదు. పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలోని మహబూబ్‌నగర్ హైస్కూల్లో పది రోజులకు పైగా జరిగింది. గతేడాది 2.48 లక్షల పేపర్లు జిల్లా కేటాయించగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు స్పాట్లో పాల్గొన్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనంలో పాల్గొనే ఉపాధ్యాయులకు ఒక స్క్రిప్ట్‌కు వ్యాల్యుయేషన్ చేసినందుకు రూ.10లతో పాటు సీనియర్, జూనియర్ టీచర్లకు వేర్వేరుగా డీఏలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు గతేడాది మూల్యాంకన నిధులు మొత్తం రూ.76 లక్షలు రావాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటికే అనేక పర్యాయాలు ఉపాధ్యాయు లు విద్యాశాఖ, జిల్లా అధికారులకు, రాష్ట్రస్థాయిలోనూ విన్నవించినా.. చేతికి మాత్రం డబ్బులు అందలేదు. దీనికి తోడు ప్రస్తుత స్పాట్ కేంద్రంలో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ఒకటో తరగతి విద్యార్థులు కూర్చునే బెంచీల్లో కూర్చొని పేపర్లు దిద్దాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ స్పాట్ కేంద్రానికి ఉపాధ్యాయులు వస్తున్నా.. సరిపడా సిబ్బంది లేరు. మౌలిక వసతులకు వారే.. మంచినీళ్లు ఇచ్చేందుకు వారే అన్నట్లు ఉంది పరిస్థితి. క్యాంటిన్ లేదు.. కనీస వసతులు లేవు.
గతేడాది మొత్తం 405 పేప ర్లు దిద్దినా.. ఏడాది అవుతున్నా ఒక్కపైసా చేతికి అందలేదు.. అదేమంటే ట్రెజరీలో ఉన్నాయ్ అంటున్నారు.. ఎన్ని నెలలు ఉం టాయండీ ట్రెజరీల్లో.. పేపర్‌కు రూ. 10లు మాత్రమే ఇచ్చారు. డీఏ, ఇతరత్రా అలవెన్సులు అన్నీ కలుపుకుని మొత్తం రూ. 7,410లు రా వాల్సి ఉంది. ఎంత అని కాదు.. సకాలంలో అందించారా లేదా అనేది ముఖ్యం.
– తిరుపతమ్మ, ఎస్ఏ తెలుగు, రాజాపూర్
పోయినసారివే రాలే.. ఇక ఇప్పటివి ఎప్పుడిస్తారో..! ఇప్పు డు పేపర్లు దిద్దేవారు మీకు గతేడాదివి ఇవ్వలేదంటా.. మాకు ఈ సారి ఇస్తారా.! అంటుంటే ఏం చెప్పాలో తోయడం లేదు.. అందుకే ఈ రోజు పేపర్లు దిద్దడం ఆపేసాం. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఇచ్చి మహబూబ్‌నగర్‌లో ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉంది.
– బి.జ్యోతికుమారి, ఎస్ఏ, సీసీకుంట
గతేడాది సీఈ చీఫ్ ఎగ్జామినర్‌గా చేశా.. స్పాట్ రేట్లను వందశాతం వెంటనే పెంచాలి. ఇంటర్మీడియట్‌తో సమానంగా పదో తరగతికి చెల్లించాలి. అక్కౌంట్లో జమ చేయకుండా నేరుగా చేతికి అందించాలి. ఈ కుబేర్, ట్రెజరీల్లో ఉన్నాయంటూ కాలయాపన చేస్తున్నారు. చేసిన పనికి వెంటనే చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. లేదంటే ఆందోళనలు నిర్వహిస్తాం
– డా.ఎం.మురళి, టీఆర్టీఎఫ్ జనరల్ సెక్రటరీ, మహబూబ్‌నగర్
గతేడాది పదో తరగతి మూ ల్యాంకనం బడ్జెట్ మంజూరైంది. రాష్ట్రస్థాయిలో ఫైనాన్స్ అధికారులతో మాట్లాడాం. ఎక్కువ అమౌంట్ ఉండటంతో కాస్తా ఆలస్యమైందని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదిఏమైనా విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి మానవతా దృక్పథంతో స్పాట్‌ను కొనసాగించాల్సిందే.!
– ప్రవీణ్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి, మహబూబ్‌నగర్