SLBC Tunnel | అచ్చంపేట రూరల్ : మన్నెవారిపల్లి నుండి ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాలకు సంబంధించి సర్వే పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్వో, వైమానిదళ హెలికాప్టర్‌తో డెన్మార్క్ దేశానికి చెందిన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ అధునాతన పరికరాలతో లైడార్ సర్వేను చేపట్టింది. మండలంలోని మన్నెవారి పల్లి సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ నుండి మరో మారు సొరంగం తవ్వకాలను చేపట్టెందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇటీవల ఢిల్లీ పర్యనకు వెళ్లిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పర్యటన ముగించుకొని వచ్చిన అనంతరం గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్జీఆర్ఐ సొరంగం కూలిన ప్రదేశంలో నీటిపారుదల శాఖతో కలిసి కేంద్ర బృందం పరిశీలన చేస్తున్నారు. అయితే అంబ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో సొరంగం పనులు చేస్తుండగా ఫిబ్రవరి 22న మట్టి కుప్పకూలడంతో 8 మంది చిక్కుకోగా ఇద్దరు మృతదేహాలు మాత్రమే లభ్యం కాగా మిగిలిన ఆరుగురు డెడ్ బాడీల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఎస్ఎల్బీసీ సొరంగం పై భాగంలో ప్రమాదం జరిగిన 14 కిలోమీటర్ వద్ద నుండి వైమానికదళ హెలికాప్టర్ ప్రొఫెసర్ తివారి ఆధ్వర్యంలో లైడార్ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్యలను చేపట్టింది.
ఈ సర్వేలో డెన్మార్క్ చెందిన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పరికరాలను ఉపయోగిస్తూ ప్రధానంగా ప్రమాద స్థలంలో ఉన్నటువంటి భూమి అంతర్భాగంలో భూమి పొరలు, షీర్ జోన్లు పరిస్థితి ఎలా ఉందో కనుక్కునే ప్రయత్నం చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఎస్ఎల్బీసీ ముఖద్వారం అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి అలాగే అమ్రాబాద్ మండలంలోని నల్లవాగు, మల్లెలతీర్థం ప్రదేశాలలో సర్వే పనులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని, గత రెండు రోజుల నుండి మన్నెవారిపల్లి ప్రదేశంలో సర్వే చేపడుతున్నారు. ఈ పనులను గుట్టు చప్పుడు కాకుండా అధికారులు చేపడుతున్నట్లు సమాచారం.