జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని ఉదయాన్నే ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకొన్నారు. అర్చకులు అభిషేకాలు, అర్చనలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
గట్టు, ఆగస్టు 4 : గట్టుతోపాటు వివిధ గ్రామాల్లో అమావాస్య పూజలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమావాస్య సందర్భంగా ఆలయాలను భక్తులు అధిక సంఖ్యలు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గట్టు గండి ఆంజనేయస్వామి ఆలయంలో పంచామృతాభిషేకం నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మాచర్లలోని చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారిని అందంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
గద్వాల రూరల్, ఆగస్టు 4 : నడిగడ్డ ఇలవేల్పు జములమ్మను రమ్య ఇండస్ట్రీస్ అధినేత బండ్ల రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం అమావాస్య సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ఈవో పురేందర్ స్వాగతం పలికి అర్చన చేయించారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ సతీశ్, అర్చకులు పాల్గొన్నారు.
వనపర్తి టౌన్, ఆగస్టు 4 : జిల్లా కేంద్రంలోని 7వ వార్డు పీర్లగుట్ట పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం ఎమ్మెల్యే మేఘారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నక్క రాములు, జంపన్న, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్, ఆలయ కమిటీ సభ్యులు వెంకటస్వామి, బాలస్వామి, కాలనీవాసులు అరవింద్‌నాయక్, తిరుపతినాయక్ ఉన్నారు.
ఎర్రవల్లి చౌరస్తా, ఆగస్టు 4: ఎర్రవల్లి చౌరస్తాలోని శివాలయంలో అమావాస్య సందర్భంగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఇటిక్యాల, ఆగస్టు 4: ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే అర్చకులు ప్రహ్లాదాచారి, మారుతాచారి, సందీపాచారి, వాల్మీకి పూజారులు స్వామివారికి బిందెసేవ, పంచామృతాభిషేకం, ఆకుపూజ, మహామంగళహారతి, తీర్థప్రాదాల నివేదన కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం అమవాస్య ప్రత్యేక దినం కావడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీవారు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి రామన్‌గౌడ్ పర్యవేక్షించారు.
ధరూరు, ఆగస్టు 4 : పెద్ద చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయానికి ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
అయిజ, ఆగస్టు 4: పంచముఖ ఆంజనేయస్వామి రథోత్సవంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తెలంగాణ సరిహద్దులోని రాయిచూరు జిల్లాలోని గణదళంలో వెలిసిన పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో భాజాభజంత్రీలు.. మేళ తాళాలు.. పండితుల వేదమంత్రోచ్ఛారణలు.. భక్తుల శ్రీరామ జయరామ నామాల నడుమ ఆంజనేయస్వామి రథోత్సవం రమణీయంగా నిర్వహించారు. ఆదివారం అమావాస్య కావడంతో తెలంగాణ, కర్ణాటక, ఏపీ భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు అర్చకులు స్వామివారికి అభిషేకం, ఆకుపూజ, పుష్పాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
అలాగే అయిజలోని తిక్కవీరేశ్వర స్వామికి భక్తులు విశేష పూజలు చేశారు. ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని తిక్కవీరేశ్వరస్వామిని ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ఉదయం అభిషేకం, అలంకరణ, పుష్పాభిషేకం, అర్చనలు నిర్వహించారు. అలాగే అయిజ పట్టణంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్ప స్వామి, వీరబ్రహ్మేంద్ర శివరామాంజనేయస్వామి, ఉత్తనూర్ ధన్వంతరి వేంకటేశ్వరస్వామి, భ్రమరాంభిక, గుంతరామలింగేశ్వరస్వామి, తుపత్రాల ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
అలంపూర్, ఆగస్టు 4: జోగుళాంబ ఆలయం యాగశాలలో ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని అర్చకులు చండీహోమం నిర్వహించారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.వెయ్యి రుసుం ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో చెల్లించాలని ఈవో పురేందర్‌కుమార్ పేర్కొన్నారు. ఆలయంలో ఆదివారం నిర్వహించిన చండీహోమంలో 414మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ సమీపంలోని తుంగభద్రా నదిలో పవిత్ర స్నానాలు చేసి ఆలయ దర్శనం చేసుకున్నారు. అమావాస్యను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో ఎంపీ రఘునందన్‌రావు దంపతులు దర్శించుకున్నారు.
ఖిల్లాఘణపురం, ఆగస్టు 4: మండల కేంద్రలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు స్వామివారికి అర్చన, అభిషేకాలు నిర్వహించి ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. అనంతరం సింగిల్‌విండో చైర్మన్ మురళీధర్‌రెడ్డి , పద్మ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కమ్మరి గోపి, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
మల్దకల్ ఆగస్టు 4 : ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తాహ భజనలు కొనసాగుతున్నాయి. ఆదివారం మల్దకల్, పెద్దొడ్డి ,మల్లెందొడ్డి, బింగిదొడ్డి, చిన్న తాండ్రపాడు, మంగంపేట, పర్ధిపురం తదితర గ్రామాలకు చెందిన భజన భక్తులు పాల్గొన్నారు. అలాగే ఆదివారం అమావాస్య పురస్కరించుకొని కర్ణాటక ప్రాంతం రాయిచూర్, బళ్లారి , ఆంధ్రా ప్రాంతం నుంచి కర్నూల్, గుంతకల్లు, ఎమ్మిగనూర్ నుంచే కాక నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు కాకతీయ టెక్నో పాఠశాల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి, అర్చకులు ధీరేంద్రదాస్, రవిచారి, మధుసూదనాచారి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
మల్దకల్, ఆగస్టు 4 : ఆషాఢ మాసం చివరిరోజు అమావాస్య పురస్కరించుకొని మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో మహిళలు గౌరీ మాతా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల పూలు, పండ్లు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలు గౌరీ మాత వ్రతం నిర్వహించారు.