అలంపూర్,సెప్టెంబర్ 22 : కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం లేదని, అందులో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటని ఏబీవీపీ నాయకులు లోకేశ్, వెంకటేశ్ ఆరోపించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులు మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు అలంపూర్ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రూ.8600 కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే రీయింబర్స్ మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశా రు. అంతకుముందు విద్యార్థులు సమీప కళాశాలల నుంచి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.