అమ్రాబాద్, సెప్టెంబర్ 14 : మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర వసతి గృహంలో ఆదివారం విద్యార్థులే స్వయంగా వంటచేసుకొని అల్పాహారంతో సహా భోజనాలు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు విద్యార్థులను అడగగా రెండు రోజులు సెలవు రావడంతో వార్డెన్ అందుబాటులో లేడని, కార్మికులు ప్రభుత్వం తమ వేతనాలను అందించాలని సమ్మె నిర్వహిస్తున్నారని వారు తెలిపారు.
వంట చేయడానికి పెట్టడానికి కార్మికులు లేక ఆకలితో ఉంటున్నామని వంట చేయమని వంట కార్మికులను అడిగితే మేము సమ్మెలో ఉన్నామని ఇప్పుడు మేము ఎలాంటి పనులు చేయమని వారు చెప్పడంతో ఈ విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకువెళ్లాలన్నా ఆయన అందుబాటులో రాలేదు. దీంతో పదో తరగతి విద్యార్థులైన మేము స్వయంగా వంట చేసి మిగతా పిల్లలకు పెట్టి తాము తింటున్నామని విద్యార్థులు తెలిపారు.
వంట చేసుకొని అందరం తిని గిన్నెలు కడగడానికి సమయం పడుతుందని చదువు కోవటానికి సమయం సరిపోవడం లేదని ఇది ఇలాగే ఉంటే మాకు పాఠశాలకు వెళ్లడానికి సమయం సరిపోక ఇబ్బందులకు గురవుతామని విద్యార్థులు తెలిపారు. వసతిగృహ వార్డెన్ ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని మాకు భోజనాలు వండించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ వసతిగృహాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వసతిగృహాల్లో ఉండే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కార్మికులు తెలిపారు.