దేవరకద్ర: పాఠశాల పైనుంచి దూకి ఓ విద్యార్థి గాయపడిన సంఘటన చౌదర్‌పల్లిలోని గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన శ్రవణ్ అనే విద్యార్థికి చౌదర్పల్లి గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.
కాగా, శ్రవణ్ మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పాఠశాల పైకి వెళ్లి కిందికి దూకాడు. గదిలో విద్యార్థి లేడని గ్రహించిన వార్డెన్ చుట్టుపక్కల పరిశీలించగా పాఠశాల వెనక భాగంలో కింద పడి ఉండటంతో ప్రిన్సిపాల్‌కు సమాచారమిచ్చి చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి గదిలో నుంచి ఎవరికి చెప్పకుండా పాఠశాల పైకి వెళ్లి కిందికి దూకాడని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారన్నారు.
విద్యార్థి కుటుంబ సమస్యల కారణంగానే పైనుంచి కిందికి దూకి ఉండొచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశంతో జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా జోనల్ అధికారి రాణి, జిల్లా వెల్ఫేర్ అధికారి వాణిశ్రీ, తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో శ్రీనివాసులు పాఠశాలను సందర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని వారు తెలిపారు.