మానవపాడు, జనవరి 5 : సిద్దిపేట మెడికల్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతూ ఆత్మహత్య చేసుకున్న లావణ్య (24) అంత్యక్రియలు సోమవారం ఆమె స్వగ్రామంలో నిర్వహించారు. వైద్య విద్య పూర్తి చేసి ప్రజలకు సేవ చేయాల్సిన యువ వైద్యురాలు అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రం లో మునిగితేలారు. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన లావణ్య సిద్దిపేట మెడికల్ కళాశాలలో 2020 వైద్య విద్యార్థిని అక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటోంది.
శనివారం రాత్రి హాస్టల్ గది లో ఎవరూ లేని సమయంలో విషపూరిత ఇంజక్షన్ తీసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదులోని నిమ్స్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందగా లావణ్య మృతదేహనికి సోమవారం గ్రామానికి తెచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో వైద్య విద్యార్థులతోపాటు బంధువులు పాల్గొన్నారు.