మహబూబ్నగర్ విద్యావిభాగం, ఆగస్టు 26 : పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడంతో ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు పెద్దదిక్కుగా ఉన్న ‘పాలమూరు విశ్వవిద్యాలయం’ మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతారని అంతా భావించారు. కానీ రేవంత్రెడ్డి ఈ ఏడా ది యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఒక్కరూపాయి నిధులు కూడా విదిల్చలేదు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యకు సముచిత స్థానం ఇస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం మాటలన్నీ నీటి మూటలే అని తేలిపోయాయని అంటున్నారు.
విశ్వవిద్యాలయానికి అత్యంత ప్రధానమైన ఉప కులపతి, రిజిస్ట్రార్ ఈ రెండు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పీయూ పరిపాలనా మండలి (13 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్) గడువు ముగిసి ఆర్నెళ్లు అవుతుంది. ముఖ్యంగా ఆచార్యుల కొరత వేధిస్తోంది. బోధన, పరిశోధన, పరిపాలనా రంగాల్లో కీలకమైన భూ మిక పోషించే ఆచార్యుల నియామకాలు లేక పదేళ్లు అవుతోంది. పీయూలోని అన్ని విభాగాల్లో కలిపి 95 మంది ఆచార్యులకుగానూ 19 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. పీయూతో అనుబంధంగా ఉన్న నాగర్కర్నూల్, జోగుళాంబ-గద్వాల, వనపర్తి జిల్లాల పరిధిలోని పీజీ సెంటర్లలో కూడా ఆచార్యుల పోస్టులు 75 శాతానికిపైగా ఖాళీలు ఉన్నాయి. బోధనేతర సిబ్బంది పోస్టులు మొత్తం 16కుగానూ కేవలం రెండు పోస్టులు మాత్రమే భర్తీకి నోచుకోగా మిగిలిన 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విశ్వవిద్యాలయంలో మొత్తం 17 విభాగాల్లో 19 కోర్సులు ఉన్నాయి. ప్రతి విభాగంలో ఒక ఆచార్యుడు విధిగా ఉండాలనే నిబంధన ఉన్నా 15 ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వసతి గృహాల కొరత తీవ్రంగా ఉన్నది. పీయూలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సరిపడా లేక ఒక్కో గదిలో 10 నుంచి 14 మంది విద్యార్థినులు ఉంటున్నారు. పురుషులకు మూడు వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు కిటికీలు ఊడి.. బాత్రూం డోర్లు సరిగా లేక విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. పీహెచ్డీ కోర్సులు అందుబాటులో ఉన్నా.. పరిశోధక విద్యార్థులకు ఎలాంటి వసతి సౌకర్యాలు లేవు. వర్సిటీ సముదాయంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మొత్తం కలుపుకొని సుమారు 2 వేల మందికిపైగా ఉం టారు.
పీయూలో పీజీ, ఫార్మసీ, ఎంఈడీ అకాడమిక్ కళాశాల భవనాలు, బాలుర, బాలికల వసతి గృహాలతోపాటు పరిపాలన భవనం, గ్రంథాలయం, ఆడిటోరియం, సైన్స్ బ్లాక్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, హెల్త్ సెంటర్, వీసీ నివాస సముదాయం ఇలా అనేక విభాగాలు ఉన్నాయి. వీటన్నింటికీ నిత్యం రాకపోకలు సాగించే వారిపై పూర్తిస్థాయిలో నిఘా కరువైంది. సిబ్బంది, అధ్యాపకులకు బయోమెట్రిక్ యం త్రాలు ఉన్నా.. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 81 డిగ్రీ కళాశాలలు ఉండ గా అందులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 20, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు 61 ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 32వేలకుపైగా సీట్లకుగానూ ఇప్పటి వరకు దోస్త్ ద్వారా 12 వేలకుపైగా మాత్రమే భర్తీ అయ్యాయి.
ఈ ఏడాది 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11.74 కోట్లు.. ఇవి వేతనాలకు మాత్రమే విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయా ల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించినా.. అందులో పాలమూరు వర్సిటీకి ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా అందలేదు. కేంద్ర ప్రభుత్వం సైతం పీఎం ఉషా పథకం కింద రూ.100 కోట్లు మంజూరు చేసినా.. అవి నేటికీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పటికైనా నిధు లు విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.