అయిజ, మార్చి 14 : ఆర్డీఎస్ నీటివాటా ముగిసింది. ఈ ఏడాది కర్ణాటకలోని టీబీ డ్యాంకు వచ్చిన వరద నీటి జలాలకు అనుగుణంగా ఆర్డీఎస్ ఆయకట్టుకు 5.896 టీఎంసీలను టీబీ బోర్డు కేటాయింపులు జరిపింది. 5.896 టీఎంసీల నీటిని ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన వానకాలం, యాసంగి పంటలకు ఐదు విడుతలుగా టీబీ డ్యాం ద్వారా అధికారులు ఇండెంట్ పెట్టి విడుదల చేయించారు. ఈ నెల 13 నాటికి ఆర్డీఎస్ నీటివాటాను పూర్తిగా వినియోగించారు. అలాగే ఏపీలోని కర్నూల్, నంద్యాల, కడప జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే కేసీ కెనాల్ ఇండెంట్ 7.05 టీఎంసీలు సైతం ముగిసింది.
ఆర్డీఎస్, కేసీ కెనాల్ 40-60 రేషియో ప్రకారం ఉమ్మడి ఇండెంట్ నీటిని టీబీ డ్యాం ద్వారా తుంగభద్ర నదిలో తీసుకున్నారు. దీంతో ఇరు రాష్ర్టాల నదీతీర ప్రాంత పల్లెలు, పట్టణాల తాగునీరు, సాగునీటికి ఇక్కట్లకు గురికావాల్సి వస్తుందని ఆయా ప్రాంతాల ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని అయిజ మండలంలోని రైతులు యాసంగిలో వరి పంట అధిక మొత్తంలో సాగు చేశారు. ఆరుతడి పంటలకు భూములు అనువైనవి కాకపోవడంతో రైతులు వరిసాగు వైపే మొగ్గుచూపారు.
ప్రస్తుతం పంటలు పాలుపోసే దశలో ఉండడంతో ఏప్రిల్ రెండో వారం వరకు సాగునీరు అందితే పంటలు చేతికొస్తాయని, లేకపోతే 50 శాతం పంటలు ఎండుతాయని ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, అధికార యంత్రాంగం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి టీబీ డ్యాం నుంచి మరో రెండు టీఎంసీల నీటిని విడుదల చేయించి పంటలను కాపాడాలని, ఆ దిశగా సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వ 8.6 అడుగులు ఉండగా, ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 632 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్ ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని డీ-25 వరకు చేరాయని ఆయన వెల్లడించారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి కర్ణాటక, ఏపీ రాష్ర్టాల సాగు, తాగునీటి అవసరాలకు 8,790 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 105.788 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 22.126 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1633 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గానూ ప్రస్తుతం 1600.46 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.