మాగనూరు : గ్రామపంచాయతీ ( Panchayat Elections ) ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా పోలీసులు ఎన్నికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు మండలంలోని వడ్వాట్ గ్రామంలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సీఐ రామ్‌లాల్ ( CI Ramlal ) , ఎస్సై అశోక్ బాబు ప్రత్యక్షంగా సందర్శించి సమగ్ర పరిశీలన నిర్వహించారు.
అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా పరిస్థితులను సూక్ష్మంగా పరిశీలించి, అక్కడి పోలీసులు, ఎన్నికల సిబ్బందితో సమన్వయం, సన్నద్ధతపై సమగ్ర చర్చ జరిపారు. సమస్యాత్మకంగా గుర్తించబడిన పోలింగ్ బూత్‌లల్లో అధిక బందోబస్తును ఏర్పాటు చేయడం, అవసరమైన లైటింగ్, బారికేడ్లు, సీసీ కెమెరాలు, క్యూలైన్ నిర్వహణ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ వంటి సదుపాయాలపై సూచనలు చేశారు.
గ్రామంలోని పరిస్థితులు, జనసంచారం, గత ఎన్నికలలో నమోదైన సమస్యలు, స్థానిక సున్నితాంశాలను పరిగణనలోకి తీసుకుని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఎన్నికల రోజున ఎటువంటి అల్లర్లు, బెదిరింపులు, అక్రమ రవాణాలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.