ఆత్మకూర్, మార్చి 15: రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఆత్మకూర్-చర్ల పరమేశ్వర స్వామి దేవాలయం, అమరచింత మండలంలోని చంద్రఘడ్ కోటను సందర్శించనున్నారని ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రహమతుల్లా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తులసీరాజ్ తెలిపారు. శనివారం రహమతుల్లా, తులసీరాజ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే ఆత్మకూర్ పట్టణంలోని చర్ల- పరమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సారధ్యంలోని కమిటీ ఘనంగా నిర్వహించిందన్నారు.
పర్యాటకుల కోసం రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చించి బోటు ఏర్పాటు చేసినట్లు రహమతుల్లా, తులసీరాజ్ చెప్పారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఆత్మకూర్, అమరచింత మండలాల్లో సందర్శిస్తారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలుగా ఉపయోగపడే స్థలాలను సందర్శించి పర్యాటక కేంద్రాలుగా గుర్తిస్తారన్నారు.