పేరు ఘనం.. సౌకర్యాలు శూన్యం’ అన్నట్లు అచ్చంపేట దవాఖాన పరిస్థితి తయారైంది. వంద పడకల స్థాయి ఉన్నా.. సరిపడా మంచాల్లేక రోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఒక్కో బెడ్డుపై ఇద్దరు.. ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ వైద్యశాల కిటకిటలాడు తున్నది. అయితే సిబ్బంది కొరత వేధిస్తున్నది. ప్రతిరోజూ మధ్యాహ్నానికే ఔట్‌పేషెంట్లకు సేవలు నిలిచిపోతున్నాయి. దీంతో రోగులకు ‘ఓపి’క నశించిపోతున్నది. 44 మందికిగానూ కేవలం 10 మంది డాక్టర్లే విధులు నిర్వర్తిస్తుండడంతో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– అచ్చంపేట రూరల్, సెప్టెంబర్ 21
అచ్చంపేట దవాఖాన పేరుకే వంద పడకల స్థాయి.. కానీ రోగులకు మాత్రం సరిపడా సదుపాయాలు కరువయ్యాయి. అందుబాటులో డాక్టర్లు, మంచాలు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. రెండు నెలల నుంచి సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో వైద్యశాల రోగులతో కిక్కిరిసిపోతున్నది. నిత్యం వందలాదిగా తరలివస్తుండడంతో చికిత్స కోసం బారులుదీరుతున్నారు. రోగులను పరీక్షించిన డాక్టర్లు వివిధ రకాల పరీక్షల కోసం రెఫర్ చేస్తున్నారు. వారు టెస్టులు చేయించుకొని చికిత్సలు చేయించుకుంటుండడంతో వైద్యశాల 3వ అంతస్తులో ఉన్న 4వ రూంలో మధ్యాహ్నం 12 గంటల వరకే బెడ్లన్నీ ఫు ల్ అవుతున్నాయి. ఈ వార్డులో విధుల్లో ఉండే ఇద్దరు నర్సింగ్ సిబ్బంది ఇక్కడి రోగులకు చికిత్సలు అందిస్తున్నారు.
తక్కువగా మంచాలు ఉండడంతో ఒక్కో బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మంచాలు ఖాళీ గా ఉంటేనే చేర్చుకుంటామని నర్సింగ్ ఆఫీసర్లు తెగేసి చెబుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. దీంతో చేసేది లేక కొందరు పక్కవారిని బతిమిలాడి సెలెన్ ఎక్కించుకుంటుండగా.. మరికొందరు.. వార్డులో నేలపై కూర్చుంటున్నారు. మరికొందరు మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు దవాఖానల దారి పడుతున్నారు. సర్కా రు దవాఖానల్లో వైద్యం చేయించుకోవాలంటే రోగికి కచ్చితంగా సహాయకుడు అవసరమని, ఆధార్ కార్డుతో రావాలని సిబ్బంది సూచిస్తున్నారు.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది.. అచ్చంపేట వంద పడకల దవాఖాన పరిస్థితి. వివిధ రోగాల బారిన పడి దవాఖానకు వచ్చిన వారికి మందుల కొరత వేధిస్తున్నది. వైద్యులు చీటీపై మందులు రాసి పంపిస్తుండ డంతో రోగులు, వారి సహాయకులు ప్రైవేటు మెడికల్ షాపులకు పరుగులు పెడుతున్నారు. శనివారం అచ్చంపేట దవాఖానను ‘నమస్తే తెలంగాణ’ విజిట్ చేయగా, పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో ప్రజలు సర్కారు దవాఖానకు క్యూ కడుతున్నారు. దగ్గు, జ్వరం, సర్ది, ఒళ్లు, మోకాళ్ల నొప్పులతో వైద్యం కోసం దవాఖానకు వస్తున్నారు. అయితే వైద్యులు, సిబ్బంది కొరతతో వైద్య సేవలు అంతంత మాత్రమే అందుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా లేవన్నారు. బయటి నుంచి వాటర్ బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. ఇక్కడ అన్నీ సమస్యలే అంటూ అసహనం చెందారు.
అచ్చంపేట దవాఖాన వంద పడకలదైనా అనుమతులు మాత్రం 70 పడకలకే ప్రభుత్వం ఇచ్చింది. పూర్తిస్థాయిలో పడకలకు సరిపడాడాక్టర్లు లేరని 44 మందికిగానూ కేవలం 10 మందిని మాత్రమే నియమించింది. రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో స్థాయిని పెంచడంతోపాటు వైద్యులనూ కేటాయించాలి. అలాగే శానిటరీ సిబ్బంది కొరత ఉన్నదని, స్థాయి పెంపు చేయాల్సిందిగా నివేదికలు అందించాం. నిర్ణయం ప్రభుత్వం చేతుల్లో ఉంది. నెల రోజుల నుంచి సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో రోగులు పెద్ద మొత్తంలో దవాఖానకు వస్తున్నారు. బెడ్లు సరిపడాలేని మాట వాస్తవమే.. ప్రస్తుతం కేవలం 70 వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిపైనే రోగులకు సిబ్బంది వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అదనంగా బెడ్ల కోసం వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు నివేదించాం. సర్కారు మంజూరు చేయాల్సి ఉంది.
– డాక్టర్ ప్రభు, సూపరింటెండెంట్, అచ్చంపేట దవాఖాన
దవాఖానకు రోగులు అధికంగా వస్తున్నారు. సీజనల్ వ్యాధులతో టెస్టులు చేయించు కోవాలని డాక్టర్లు సూచిస్తూ చిట్టీ రాసిస్తున్నారు. టెస్టుల కోసం చిట్టీలు పట్టుకొని గంటల తరబడి లైన్లో నిల్చుంటున్నాం. సరిపడా సిబ్బంది లేకపోవడంతో బాగా ఆలస్యమవుతున్నది. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఓపీ చూస్తుండడంతో మధ్యాహ్నం వరకు కూడా రోగులు వైద్యం చేయించుకోవడానికి బారులు తీరారు. సిబ్బంది కొరత తీర్చాలి.
– మౌనిక, హాజీపూర్
మా పాపకు జ్వరంతోపాటు సర్ది అయ్యింది. శనివారం సర్కారు దవాఖానకు తీసుకొచ్చి డాక్టర్ సలహా మేరకు టెస్టులు చేయించా. డాక్టర్ రిపోర్టులు చేసి నాలుగు రకాల మందులు రాసిచ్చాడు. మందులు తీసుకునేందుకు వెళితే సిబ్బంది ఒక్క దగ్గు మందు చేతికి ఇచ్చి మిగతావి దవాఖానలో సప్లయ్ లేదు బయటికెళ్లి తీసుకోవాలని చెప్పారు. ప్రైవేట్‌కు వెళ్లి చూయించుకోలేని పరిస్థితుల్లోనే సర్కారు దవాఖానకు వచ్చాం. ఇక్కడ కూడా అవి లేవు, ఇవి లేవు అంటూ ప్రతీది బయటకు రాస్తే మేం ఏం చేయాలి.
– మహ్మద్ నిరంజన్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ జిల్లా