మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 2 : దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణన కూడా చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని జాతీయ ఓబీసీ సలహదారుడు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బీపీ మండల్ మనుమడు ప్రొఫెసర్ సూరజ్ మండల్, జాతీయ ఓబీసీ నాయకులు, తమిళనాడు రాజ్యసభ సభ్యుడు విల్సన్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్‌తో కలిసి ఓబీసీ సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జనగణనతోపాటు కులగణన చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు కేటాయించి, చట్టబద్ధత కల్పించాలన్నారు. సాకులు చెప్పి తప్పించుకుంటే, ఓబీసీలు దేశవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. అదేవిధంగా విద్యా ఉద్యోగం, స్థా నిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేట్ సెక్టార్లలో రిజర్వేషన్లు కల్పించి, ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కేంద్రానికి వివరించాలన్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఆయన సూచించారు.