నారాయణపేట టౌన్, అక్టోబర్ 19 : గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం కప్ దోహదపడుతుందని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శనివారం పట్టణ సమీపంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు నిర్వహించిన సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీని ఎస్పీ యోగేశ్ గౌతమ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నవంబర్ మొదటివారంలో సీఎం కప్ క్రీడాపోటీలు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిల్లో గెలుపొందిన క్రీడాకారులతో హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎస్పీ యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఈవో అబ్దుల్‌ఘని, యువజన సర్వీసుల శాఖ సిబ్బంది సాయికుమార్, పీఈటీలు విద్యార్థులు పాల్గొన్నారు.
పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలి..
పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్దూర్, కోస్గి మండలాల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా పట్టణ ప్రణాళిక అధికారి కిరణ్ ఎల్ఆర్ఎస్ యాప్‌లో ఉత్పన్నమవుతున్న సందేహాలను నివృత్తి చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీపీవో కృష్ణ, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రతి అంశాన్ని అప్లోడ్ చేయాలి
పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ప్రక్రియను ఆమె పరిశీలించారు. యాప్‌లో ప్రతి అంశాన్ని పరిశీలించి అప్లోడ్ చేయాలని సూచించారు. రెవెన్యూ, నీటి పారుదల, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశీలించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలన్నారు. మహబుబ్‌నగర్ రోడ్డు మార్గంలోని రైతుబజార్ సమీపంలో 4.20 ఎకరాల్లో పలు ప్లాట్లకు సంబంధించి 30ఫీట్ల రోడ్డు వదిలేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలుంటే పరిష్కరించాలని టీపీవో కిరణ్‌కు సూచించారు. మండలంలో 1,800 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సమస్యలను తాసీల్దార్ జమీల్‌ను అడిగి తెలుసుకున్నారు. జిన్నారం రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న మండల కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కొండన్న, ఎంపీవో పావని, ఆర్ఐ సుధాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.