మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 8: పోలీస్‌స్టేషన్ రైటర్స్ సకాలంలో ఎఫ్ఐఆర్, చార్జీషీట్, ఫైనల్ రిపోర్టు ఇతర డాక్యుమెంట్లను సకాలంలో అప్లోడ్ చేయాలని ఎస్పీ నర్సింహ సూచించారు. జిల్లా పోలీసు కా ర్యాలయంలో బుధవారం స్టేషన్ రైటర్స్, టెక్నికల్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టేషన్ రైట ర్స్, వర్టికల్ సిబ్బంది మరింత నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. సకాలంలో డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడంవల్ల రైటర్స్ వర్టికల్లో పోలీస్‌స్టేషన్ ముం దంజలో ఉంటుందన్నారు.
అలాగే స్టేషన్ లో సిబ్బంది సెలవులు, గ్రీవెన్స్ సమాచారం హెచ్ఆర్ఎంఎస్లో ఎప్పటికప్పుడు నమో దు చేయాలన్నారు. సైబర్ నేరస్తులతో మోసపోయిన వారు ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వస్తే వెంటనే 1930కి డయల్ చేసి బాధితుడి వివరాలను సంబంధిత పోర్టల్‌లో పొందుపర్చేలా సహాయం చేయాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ద్విచక్రవాహనం నడుపుతున్నపుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు. బాధ్యతగా విధులు నిర్వర్తించి జిల్లా పేరును ఉన్నతస్థాయికి తీసుకురావాలని కోరారు. సమావేశంలో ఏఎస్పీ రాములు, వర్టికల్ డీఎస్పీ మధు, టెక్నికల్ టీం ఎస్సై రాఘవేందర్, డీసీఆర్బీ ఎస్సై వరలక్ష్మి ఉన్నారు.