అమ్రాబాద్ : సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెక్రెటరీ అలుగు వర్షినిని (Secretary Alugu Varshini )వెంటనే సస్పెండ్ చేయాలని (Suspend Demand) అంబేడ్కర్ సంఘం నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు జక్క బాలకిష్టయ్య, మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్ డిమాండ్ చేశారు.
శుక్రవారం అమ్రాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులతో బాత్రూం, ల్యాట్రిన్ రూంలు కడిగించాలని, బూజు దులిపించాలని అహంకారపూరిత వ్యాఖ్యలు దళితులను కించపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎక్కువగా దళితులు, పేద విద్యార్థులే ఉన్న విషయాన్ని మరిచిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
రాజ్యాంగం, చట్టాల పట్ల గౌరవం లేని ఆమెతో సమాజానికి పెను ప్రమాదం ఉందని అన్నారు. సోషల్ వెల్ఫేర్ సొసైటీల్లో దళితులనే నియమించాలని డిమాండ్ చేశారు. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెకరెట్రీగా పనిచేసిన సమయంలో రెసిడెన్షియల్ స్కూళ్లు ఎంతగానో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. సమావేశంలో అంబేద్కర్ మండల మాజీ అధ్యక్షులు అవుట రామకోటి ఎల్లస్వామి , ఆశోది శేఖర్, మనోహర్ కాశి పాండీయన్ , దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.