వడ్డేపల్లి, జూన్ 1 : మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన తండ్రి మృతి చెందాడని విలపిస్తూ తండ్రి అంత్యక్రియల అనంతరం శ్మశానంలో నుంచే ఒక యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్ 10వ వార్డులో నివాసం ఉంటున్న తిరుపాల్ (66) అనే వృద్ధుడికి తీవ్ర జ్వరం రాగా కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా అక్కడి డాక్టర్లు డెంగీగా గుర్తించారు.
వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకపోకపోవడంతో వృద్ధుడు మృతి చెందాడు. తండ్రి అంత్యక్రియల అనంతరం కుమారుడు దురేంధర్ యాదవ్ శ్మశానంలో విలపిస్తూ వీడియో తీయగా అది వైరల్గా మారింది. మున్సిపల్ కమిషనర్ కాలనీల్లో సరిగ్గా పారిశుధ్య పనులు చేయించకపోవడంతో అకాల వర్షాలకు కాలనీల్లో మురుగు పెరుకపోయి అంటురోగాలు ప్రబలడంతో తన తండ్రికి డెంగీ వ్యాధి సోకి మృతి చెందాడని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. కాలనీల్లో కంపచెట్లు, డ్రైనేజీల్లో మురుగు పేరుకపోవడం ఇలా అనేక కారణాలతో రోగాలు ప్రబలుతున్నాయని ఇకనైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించాలని కోరాడు.