అచ్చంపేట, ఫిబ్రవరి 24: మా కళ్లముందే మాతోటి కార్మికులను పోగోట్టుకొవాల్సి వచ్చింది. బతుకుదెరువు కోసం జార్ఖండ్ నుంచి కుటుంబాలను వదిలివచ్చాం. మా ముందే మాతోటి వాళ్లను వదులుకోవాల్సి వచ్చింది. లోపల భయంకరమైన పరిస్థితి ఉంది. టన్నెల్లో చిక్కుకున్న మా వాళ్లను బయటకు తేవడానికి అనేక రెస్యూ బృందాలు శ్రమిస్తున్నా నేటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఇలాంటి పరిస్థితిలో మమ్ములను వచ్చి టన్నెల్లో పనులు చేయడానికి రావాలని కంపెనీ అధికారులు రెండు రోజులుగా భయపెట్టిస్తున్నారు.. లోపల ఉన్న మావాళ్లను తలుచుకొని మేము బాధపడుతున్నాం. మళ్లీ మేము లోపలికి వెళ్లి పనిచేయగలమా?.. ఇప్పటి వరకు మేము పనిచేసిన మూడు నెలల వేతనాలు ఇవ్వలేదు. మాకు బియ్యం, సరుకులు తెచ్చి వంట చేసుకొని తినడానికి డబ్బుల్లేక మా ఇండ్లకు ఫోన్లు చేసి పైసలు తెప్పించుకొని సరుకులు తెచ్చుకుంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో జేపీ, రాబిడ్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు తమ వేదన వెల్లిబుచ్చారు. సోమవారం టన్నెల్లో పనిచేస్తున్న కార్మికులను ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది. వారు మొదటగా చెప్పడానికి భయపడ్డారు. తర్వాత వారితో మాటమాట కలుపగా.. వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, బాధలను వెళ్లగక్కారు. టన్నెల్ సమీపంలో ఒక షెడ్డువేసి అందులో ఉంచారు. అక్కడ మొత్తం 150మంది వరకు ఉంటున్నారు. షెడ్డులో అడ్డంగా రేకులు కట్టి ఒక రేకుల గదిలో 8నుంచి 10మంది వరకు ఉంటున్నారు. వాళ్లు నివాసముంటున్న షెడ్డును చూస్తే పశువుల పాకగా ఉన్నది.
చిన్నగదిలో వంట చేసుకొని అక్కడే పడుకోవాలని గదిని చూపించారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు పనిచేయక నిరూపయోగంగా మారాయి. నల్లాలు పనిచేస్తలేవు. రేకులతో నిర్మించారు. రేకులన్నీ ఊడిపడ్డాయి. సిమెంటుతో చిన్న వాటర్ ట్యాంకు కట్టారు. ఆ నీళ్లనే తాగుతున్నారు. ట్యాంకును ఏళ్ల తరబడి శుభ్రం చేసిందిలేదు. కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నా రు.
ఇదిలా ఉండగా.. అందరు టన్నెల్ దగ్గరికే వెళ్తున్నారు కాని.. మా కార్మికుల వద్దకు వచ్చి ప్రమాదం ఎలా జరిగింది, మా సమస్యలు ఏమిటని అడిగేవారు లేరు. మేము ఎవరినైనా కలిసి మాగోడును చెప్పాలనుకున్నా మాకెవ్వరూ తెల్వదు. ఒక షిప్టులో 50మంది చొప్పున మూడు షిప్టుల్లో పనిచేస్తం. ఒక షిప్టులో 10గంటలు పనిచేయాల్సి ఉంటుంది. కంపెనీ అధికారులకు డబ్బులు అడిగితే ఇవ్వరు. పనిచేస్తే చేయండి లేకుంటే వెళ్లిపోండి అంటారు. పది గంటలు పనిచేస్తే 600 వరకు కూలీ వస్తోంది. తిండి కోసం పస్తులు ఉండాల్సి వస్తోంది. పనిచేసే క్రమంలో ఎలాంటి దెబ్బలు తగిలినా మా సొంత డబ్బులతోనే చికిత్స చేయించుకోవాలని కార్మికులు తమ బాధలను చెప్పుకొచ్చారు.
కంపెనీవారు అంబులెన్స్ ఇచ్చి పంపిస్తారు. దానికి డబ్బులు మేమే ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. మేమందరం పరేషాన్లో ఉన్నాం. భయపడుతు న్నాం. లోపలికి ఎలా వెళ్తాం.. లోపల మట్టి ఉంది. మీరే తీయాలని కంపెనీ అధికారులు, మేనేజర్ వచ్చి ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. మేము పనిచేస్తున్న క్రమంలోనే మా ముందే పైనుంచి మట్టి కూలీపడింది. టన్నెల్లోకి పెద్దఎత్తున నీళ్లు వచ్చాయి. భారీగా మట్టి వచ్చేసింది. మేము మా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసి బయటకొచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.
పైకప్పు నుంచి మధ్యమధ్యలో లూజ్మట్టి పడుతుంది. పైనుంచి రంధ్రాల గుండా నీటి లీకేజీ కొనసాగుతున్నది. అక్కడక్కడా ఏర్పడుతున్న లీకేజీలను పూడ్చుకుంటూ వెళ్తున్నాం. ఒక వద్ద పూడిస్తే మరో చోట లీకవుతుంది. కప్పు పైన నీళ్లు భారీగా వచ్చి చేరుతున్నట్లు అనిపించింది. నీళ్ల లీకేజీ రంధ్రాలు పూడ్చడంతో పైన ఉన్న నీళ్లు ఎటూ వెళ్లలేక ఒకేసారి నీటి ప్రవాహం పెరిగింది. ఆ రోజు రాత్రి టీబీఎం మిషన్ డ్రిల్లింగ్ చేసింది. ఉదయం వెళ్లి మిషన్ డ్రిల్లింగ్ చేసి మావాళ్లు ముందుకెళ్లి ఆరు రింగులు కూర్చోబెట్టారు. ఏడో రింగ్ కూర్చొబెట్టే పనిలో ఉండగా.. ప్రమాదం చోటు చేసుకున్నది. నీళ్ల రంధ్రాలు పూడ్చకుండా ఉండి ఉండే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు.
– మకరియూత్, కార్మికుడు, జార్ఖండ్
పైనుంచి భారీ నీటి ప్రవాహంతో పైకప్పు కూలింది. ఈ ప్రవాహానికి టన్నెల్లో రింగులు వేస్తున్న మిషన్ వెనక్కు వచ్చేసింది. టీబీఎం మిషన్ ముందుభాగంలో ఉంది. వెనుక భాగంలో చిక్కుకున్న ఎనిమిది మంది మిషన్‌తో సిమెంట్ రింగులు బిగించే పనిలో ఉండగా.. ఉన్నట్టుండి భారీ శబ్ధంతో పైనుంచి కప్పు కూలిపడింది. సరిగ్గా అది వాళ్లున్న స్థలంలోనే కూలిపడినట్టుంది.
కూలిన వెంటనే టన్నెల్ నిండా నీళ్లు, బురద వచ్చేసింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎవరికివారు ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ ఎనిమిది మంది ఎక్కడికీ కదిలే పరిస్థితి లేదు. అక్కడే మట్టిలో మూసుకొని పోయి ఉంటారు. కూలిన ప్రవాహానికి మిషనే కొంతదూరం వచ్చేసింది. వాళ్లు అయితే ప్రాణాలతో ఉండరు. వాళ్లు టన్నెల్ లోపల టీబీఎం మిషన్ వెనుకభాగం, రింగులు ఫిటింగ్ చేసే మిషన్ మధ్యలో ఉంటారు. అక్కడికి వెళ్లాలంటే ఛాతిభాగం వరకు బురద ఉంది.
– రాజ్కుమార్సాహూ, కార్మికుడు, జార్ఖండ్
నేను పదేండ్లుగా టన్నెల్లో పనిచేస్తున్నా. లోపల నీళ్లను బయటకు పంపే పైపులైన్ పనులు, ఇతర పనులు చేస్తా. జార్ఖండ్ నుంచి వచ్చా. నాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేను నెలరోజులు పనిచేస్తే రూ.16వేల నుంచి 18వేలు వస్తాయి. నేను ఖర్చులకు ఉంచుకొని కుటుంబా నికి పంపిస్తా. అయితే చేసిన కూలీకి డబ్బులు ఇవ్వరు. గట్టిగా అడిగితే వెళ్లిపోండని అంటారు.
ఇప్పుడు మూడు నెలలుగా డబ్బులు ఇవ్వలేదు. అడిగితే ఇప్పుడు డబ్బుల మాట తీయొద్దని అంటున్నారు. మేము ఏం తిని బతకాలి. మాకు పైసలు ఇచ్చేస్తే మా రాష్ర్టానికి వెళ్లిపోతాం. మాకు పైసలు ఇప్పించమని వేడుకుంటున్నం. మేము 150మంది వరకు షెడ్డులో ఉంటాం. ఒక షెడ్డు గదిలో పదిమంది వరకు ఉండాలి. వంట మాది మేమే చేసుకుంటాం. వంటల కోసం కట్టెలు ఉండవు. బాత్రూంలు సరిగ్గాలేవు. తలుపులు లేకుండా రేకులు ఊడిపోయాయి.
– దిలీప్‌కుమార్, కార్మికుడు