నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 24: ఎల్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో అధికారులు, రెస్యూ టీమ్‌ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజులైనా సహాయ చర్యలతో సమస్య కొలిక్కి రాలేదు. టన్నెల్లో ఇరుక్కున్న వారిని ఎలా తీసుకురావాలనే పరిశీలనలతోనే సరిపోయింది. ఇప్పటి వరకు టన్నెల్లో ఏ ఒక్కరి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మిగతా కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజూ మంత్రులు, ఉన్నతాధికారులు వస్తూ పరిశీలిస్తున్నారే కానీ ఎలా తీసుకురావాలనే విషయంలో అంతర్మథనం ఏర్పడింది. ఇప్పటి వరకు ఎన్డీఎస్ఎఫ్, ఎస్డీఎస్ఎఫ్ బలగాలతోపాటు కేంద్ర, రాష్ట్ర విపత్తుల బృందాలు, ఆర్మీ, నేవీ, సింగరేణి కార్మికులతోపాటు, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ, నవయుగ కంపెనీలకు చెంది న ఉన్నతాధికారులు బృందం ఇప్పటి వరకు ఘటన జరిగినప్పటి నుంచి ఏడుసార్లు టన్నెల్లో తనిఖీ నిర్వహించినా ఫలితం లేకపోయింది.
సోమవారం స్లీపర్ డాగ్‌ల సేవలను ఉపయోగించారు. గతంలో ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తులో ఈ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను సమర్థవంతంగా నిర్వహించాయన్న ఉద్దేశంతో ఎల్ఎల్బీసీ వద్దకు తీసుకొచ్చారు. వీరితోపాటు 14మంది ర్యాట్(ర్యాట్ హోల్ టీమ్) మైనర్స్ సేవలను ఉపయోగించారు. టన్నెల్లో ఉన్నవారి ఆచూకీ తెలుసుకునేందుకు స్నీపర్ డాగ్స్‌ను వినియోగించారు. ఎక్కువ మొత్తంలో టన్నెల్లో నీటి ఊట పెరడంతో లోకో బోగి టన్నెల్‌లోని 13.5 కిలోమీటర్ల పోయే అవకాశం ఉన్నప్పటికీ నీటి ఉధృతి పెరగడంతో సోమవారం మూడోవంతు వరకు టన్నెల్లోకి పోయివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
మొత్తం బురదనీరు పెరిగిపోతుండడంతో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నామని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. నీటి ఉధృతి పెరిగిన కారణంగా స్నీపర్ డాగ్స్ లోపలికి వెళ్లలేకపోయాయని టన్నెల్లోకి వెళ్లిన బృందం సభ్యులు పేర్కొంటున్నారు. పైనుంచి రంధ్రం చేసి టన్నెల్ లోపలికి వెళ్లాలన్న (వర్టికల్ డ్రిల్లింగ్) ప్రతిపాదనను తోసిపుచ్చారు. విధిలేని పరిస్థితుల్లో గ్యాస్ కట్టింగ్ మిషన్లతో పనిచేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సో మవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి టన్నెల్ ప్రాంతాన్ని పరిశీలించారు.
సాయంత్రం జే.పీ కంపెనీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. టన్నెల్లో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు వారు సజీవంగా ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. టన్నెల్లో చిక్కుకున్న ఒక అధికారి మొబైల్ ఫోన్ రింగ్ అయ్యిందని, దాని ప్రకారంగా సిగ్నల్‌తో వారి లొకేషన్ గుర్తించామన్నారు.