పెద్దకొత్తపల్లి / లింగాల / అమ్రాబాద్ : నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి ( Peddakottapalli), లింగాల( Lingala) మండలాల్లో ఆదివారం సీతారాముల కల్యాణం (Sitarama Kalyanam) మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ మహోత్సవం ముహూర్త సమయానికి ఉత్సవమూర్తులను కల్యాణ మండపానికి తీసుకొచ్చి మంగళ వాయిద్యాల నడుమ , వేద పండితుల మంత్రోచనాలు మధ్య శ్రీ సీతారాముల తలంబ్రాలను కన్నుల పండుగగా నిర్వహించారు. పెరుమాండ్లపల్లి గ్రామంలో జరిగిన కల్యాణ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి( Beeram Harsavardan Reddy) పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లింగాలలో..
లింగాల మండలం శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పూజారి భాస్కర్ సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి లింగాల మండలం నుంచి కాకుండా బల్మూర్, పెద్దకొత్తపల్లి తదితర మండలాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల సౌకర్యార్థం దాతలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అమ్రాబాద్‌లో..
శ్రీరామనవమి వేడుకలను అమ్రాబాద్ ఉమ్మడి మండలంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అమ్రాబాద్ మన్ననూర్ పదరా వంకేశ్వరం , మద్దిమడుగు తదితరాలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలు తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.