కొల్లాపూర్ : నాగర్ కర్నూలు జిల్లా సింగోటం(Singotam Jatara) లక్ష్మీనర్సింహాస్వామి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupally Krishna Rao ) కోరారు. ఈనెల 15 నుంచి 21 వరకు కొల్లాపూర్, శ్రీలక్ష్మీనరసింహాస్వామి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆలయాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ , అధికారులతో కలిసి సందర్శించిన సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటుచేయాలని పోలీస్ శాఖాధికారులను ఆదేశించారు. జాతరలో తాగునీటి, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్యం వంటి ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
రాయలసీమ భక్తుల కోసం నందికొట్కూర్ కర్నూలు నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు. అవసరమైతే సోమశిల, మంచాలకట్ట వద్ద టూరిజం శాఖకు చెందిన చిన్న బోట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
రథోత్సవం రోజున ప్రతి గ్రామం నుంచి బస్సు నడపాలని, కొల్లాపూర్ డిపో నుంచేగాక ఇతర ప్రాంతాల నుంచి అదనపు బస్సులు తెప్పించాలని సూచించారు.
గుట్కా, గంజాయి తదితర మత్తు పదార్థాలు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల న్నారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ జాతర రోజుల్లో ఆలయం వద్ద వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ చైర్మన్ ఆదిత్య లక్ష్మణ్ రావు , కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, డీఎస్పీ శ్రీనివాసులు, ఈవో రంగారావు, సింగోటం సర్పంచ్ ఆదిరాల యాదయ్య గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు శ్రీరాములు, ఉమా శంకర్, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.