వనపర్తి, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ వైఫల్యంతోనే గ్రామాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో బూతుపురాణంతోనే పాలన నడపాలనుకుంటే చరిత్ర క్షమించదని సింగిరెడ్డి చెప్పారు. సోమవారం వనపర్తి మండలం పెద్దగూడెం తం డాలో ఎండిన వరి పొలాలను మాజీ మంత్రి పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఎండిన పంటలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంటు సరఫరాలో ప్రభుత్వం రైతాంగానికి ఇబ్బందులు కల్గించడం వల్ల ఎక్కువ పం టలు ఎండిపోతున్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీల్లో ఏ పథకం కూ డా సవ్యంగా సా గడం లేదనన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాలు ప్రభుత్వం చెబుతున్న ప్రకారమే అట్టర్ ప్లాఫ్ అయ్యాన్నారు. ఏ గ్రామంలో చూసినా భరోసా, రుణమాఫీ అందని రైతులు కోకొల్లలుగా ఉన్నారన్నారు. వీటికి తోడు మళ్లీ వేసిన పంటలు సహితం ఇలా కరెంటు సమస్యలతో ఎండిపోతుంటే రైతుల బాధలు చెప్పనలవి కాదన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 448 మంది అన్నదాతలు ప్రభుత్వ నిర్వాకం వల్ల బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు.
ఇంత జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని సింగిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు ఆర్థిక, వ్యవసాయ, విద్యుత్‌శాఖల సమన్వయంతో పని చేస్తే.. గ్రామాల్లో ఒక్క పంట కూడా ఎండిపోయేది కాదని, అలాగే రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలు సక్రమంగా అమలు జరిగినా రైతుల మరణాలు ఉండేవి కా దన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సీఎంకు మాజీ సీఎంపై దుమ్మెత్తి పోయడం తప్పా మరొకటి లేదన్నారు.
ఎండిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, అక్కడి పొలాల్లో నీటి ట్యాంకరుతో వరి పొలాన్ని తడుపుతున్న తీరును చూసి మాజీ మంత్రి చలించిపోయారు. హైదరాబాద్‌లో ఆటో నడవక జీవ్లానాయక్ తండాకు వచ్చి 3 ఎకరాలు పొలం నాటుకుంటే.. మొత్తం ఎండిపోయింది. జీవ్లా భార్య శాంతమ్మ నాలుగు బోర్లు పని చేయడం లేదని, వరి పొలం మొత్తం ఎండిపోయిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ముందు కన్నీరుమున్నీరైంది. తండాలో ఇప్పటి వరకు 20 మందికి చెందిన 40 ఎకరాలకు పైగా వరి పంటలు ఎండిపోయాయని గిరిజనులు మాజీ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంట ధర్మా నా యక్, మాణిక్యం, కృష్ణానాయక్, రూప్లానాయక్, జాను తదితరులున్నారు.