వనపర్తి టౌన్, సెప్టెంబర్ 10 : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన ధైర్యసాహాసాలు ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న ఆమె విగ్రహానికి మాజీ మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకం అన్నా రు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా నాయకులు వాకిటీ శ్రీధర్, రమేశ్‌గౌడ్, ఆశోక్, పరంజ్యోతి, బండారు కృష్ణ, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, రహీం, గిరి, జోహెబ్హుస్సేన్, హేమంత్ , చిట్యాల రాము, రమేశ్, సాయిలీల, కవిత, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.