వనపర్తి, జూలై 29 (నమస్తే తెలంగాణ) : ఎల్లో కాం గ్రెస్ తీరుతోనే రైతులు కష్టాల పాలయ్యారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు రాలేదని, వర్షాలు లేవన్న బూచి చూపి రైతులను మరోసారి దగా చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో వానలు పడటం లేదని, పంటల సాగు చేయొద్దని రే వంత్ సర్కార్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దే వా చేశారు. బుధవారం ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ సర్కారు రైతులను భయపెడుతున్న తీరు విచిత్రంగా ఉందన్నారు. సాగునీరు వచ్చి పంటలు పండితే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందన్న అక్కసు కాంగ్రెస్ నేత ల్లో కనిపిస్తుందన్నారు.
నీళ్లు లేవని కేవలం భ్రమలు కల్పిస్తున్నారని, పశ్చిమ కనుమల్లో ఖచ్చితంగా వర్షాలు పడుతాయని, ఆ నీళ్లు కృష్ణా, తుంగభద్ర, భీ మా నదుల్లో కలుస్తాయన్నారు. జూరాలతో సంబ ంధం లేకుండా తుంగభద్ర ద్వారా శ్రీశైలానికి 4 వందల టీఎంసీలు వస్తాయని, ఇవన్నీ కలుపుకొంటే సాగుకు కూడా సరిపడా నీళ్లు నదుల నుంచి అందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 19 నియోజకవర్గాలకు ఎల్లూరు రిజర్వాయర్ నుంచి 9 టీఎంసీలు తాగునీటికి అవసరమని, వచ్చే జూన్ వరకు మి షన్ భగీరథ నీటికి ఇబ్బంది ఉండదన్నారు. ఆల్మట్టి, నారాయణాపూర్ ప్రాజెక్టులు ఎలా నిండాయని ఆ యన ప్రశ్నించారు. నీళ్ల కోసం రైతులు ఎదురు చూసే పరిస్థితులు కల్పించొద్దని, మనకు ఉన్న నీళ్లు పంటలకు పుష్కలంగా ఇవ్వవచ్చన్నారు.
ఆల్మట్టి 123 టీ ఎంసీలు నిండి.. నారాయణాపూర్ 30 టీఎంసీలతో నిండుకుండను తలపిస్తుండగా.. కర్టాటకలో 17.30 లక్షల ఎకరాలకు సరిపోను నీళ్లున్నాయన్నారు. పం టలు సాగైతే జూరాలకు వర్షం పడకపోయినా 5 వేల క్యూసెక్కుల ప్రవాహం నిరంతరం ఉంటుందన్నారు. కృష్ణానదిపై ఇప్పుడున్న అన్ని ప్రాజెక్టులు కలిపినా రోజుకు టీఎంసీ కంటే ఎక్కువ వాడుకోలేమని, అం దుకే పాలమూరు ప్రాజెక్టు ద్వారా రోజు 2 టీఎంసీలు ఎత్తిపోసుకునే వెసలుబాటు ఉందన్నారు. 90 శాతం పూర్తయిన పనులను వదిలి 10 శాతం పనులను రెం డున్నరేళ్లుగా సీఎం పడావు పెట్టారని ఎద్దేవా చేశారు.
గతేడాది భారీ వర్షాలు కురిసినా కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల కింద యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించిందని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. సాగునీరు ఇవ్వకుంటే క్షమించేది లేదన్నారు. ఉన్న రిజర్వాయర్లను మాత్రమే నింపాలని అధికారులకు మంత్రులు ఆదేశించారని, జూరాల నుంచి శ్రీశైలానికి నీళ్లు వెళ్లేలా చే స్తున్నారని, పీజేపీ కాల్వలకు వానకాలం పంటలకు తప్పనిసరి నీటిని విడుదల చేయాల్సిందేనని డి మాండ్ చేశారు. ఏపీలో నారుమడులు పోసుకుని రై తులు సిద్ధంగా ఉన్నారని, సీఎం రేవంత్‌రెడ్డికి పాలమూరు జిల్లా కంటే ఆంధ్రా రైతులకే అధిక ప్రా ధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ రైతు ల పక్షాన ఆందోళన బాట పడుతామంటే కాల్వలకు నీరిచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నదన్నారు. కేఎల్ఐలో ఒకే మోటర్‌ను స్టార్ట్ చేశారని, ఇందులోని మూ డు పంపులు యథావిధిగా నడవాలన్నారు. సాగునీటి కోసం ఎంత దూరమైన వెళ్తామని, రైతులకు మద్దతు గా నిలబడతామని భరోసానిచ్చారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీరు వస్తుందని, తుంగభద్రకు 20 రోజుల ఆలస్యంగా వరద వస్తుందన్న నిజం వందేళ్లుగా రికార్డులు చెబుతున్నాయన్నారు.
కాంగ్రెస్ సర్కారు రైతులపై కక్ష కట్టిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. వరదలు పొంగి పొర్లుతున్నా కాల్వలకు నీటి విడుదల చేయడం లేద ని మండిపడ్డారు. వర ద ప్రారంభమైన మూ డ్రోజులకు కొన్ని పంపులను మాత్రమే ప్రారంభించారని, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌లో ఒకే పంప్ ఆన్ చేశారని, గతేడాది 42 రోజుల తర్వాత పంప్‌లు ఆన్ చేశారని గుర్తు చేశారు. పోయిన వానకాలంలో ప్రభు త్వ నిర్వాకంతో 65 టీఎంసీలు తక్కువగా వాడుకున్నామని, ఈ సారి రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. పాలమూరు రైతుల బాగు కోసం ప్రభుత్వం పని చేయాలని హితవు పలికారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తే 70 టీఎంసీలు నిల్వ చేసుకునే రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నాయని, సీఎంగా రేవంత్ పాలమూరు జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ ఆందోళనకు దిగుతామని చెప్పగానే హడావుడిగా నీటిని విడుదల చేసినట్లు షో చేస్తున్నారన్నారు. వరద ఉరకలెత్తుతుంటే పొలాలన్నీ బీళ్లుగా పెట్టి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే రైతులు చూస్తూ ఊరుకోరని మా జీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వంలో నీళ్ల కోసం కొట్లాడాల్సి వస్తుందని, రెండున్నరేండ్ల పాలనలో సాగునీటి కోసం పోరాటం తప్పడం లేదన్నారు. రైతులతో రాజకీయాలు చేయడం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. గత యా సంగిలో క్రాప్ హాలిడే, ఈ వానకాలం ఎల్‌నినో పేరుతో వరద నీరు ఏపీకి ధారాదత్తం చేయాలని చూస్తుందని విమర్శించారు. ఇష్టారాజ్యంగా చేస్తే రైతులు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. జూరాలపై ఉన్న సాగునీటి వనరుల ద్వారా ఉమ్మడి జిల్లాలోని భూములకు నీటిని విడుదల చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు అశోక్, రవికుమార్, వామన్‌గౌడ్, రమేశ్‌గౌడ్, విశ్వేశ్వర్, ప్రశాంత్, వీరేశం, లక్ష్మీకాంత్‌రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.