దేవరకద్ర రూరల్ (చిన్నచింతకుంట), నవంబర్ 24 : చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని పేదల తిరుపతిగా పేరు గాంచిన కురుమూర్తి జాతరకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ క్రమంలో జాతర ప్రాంగణంలోని రోడ్డులో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను సరిచేయాల్సిన పోలీసులు జాతరకు వచ్చిన భక్తుడిపై దాడికి పాల్పడ్డారు.
చింతకుంట మండలం ఫర్దీపూర్ గ్రామానికి చెందిన భక్తుడు చాకలి రాములుపై చింతకుంట స్టేషన్ ఎస్సై శేఖర్ ట్రాఫిక్ పేరుతో ఇష్టం వచ్చినట్లు కొట్టినట్లు బాధితుడు వాపోయాడు. బాధితుడిని జిల్లా దవాఖానకు తరలించినట్లు స్థానికులు, భక్తులు తెలిపారు.
దేవుడి దర్శనానికి వచ్చిన భక్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు దాడులు చేయడం సరైన పద్ధతి కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చింతకుంట స్టేషన్ ఎస్సైను వివరణ కోరగా, ఆదివారం జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వాహనాలను అడ్డదిడ్డంగా ఆపడంతో ట్రాఫిక్ క్లియర్ చేసే క్రమంలో అందరినీ చెదర కొట్టే ప్రయత్నంలో ఒకరికి ఒకరు తోసుకుంటూ వెళ్లారు.. తప్పా ఉద్దేశ పూర్వకంగా ఎవరిపైనా దాడి చేయలేదని ఎస్సై పేర్కొన్నారు.