వనపర్తి, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ) : జిల్లా లో వివిధ నిర్మాణాలకు ఇసుక సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలకు పైగా వాగులు.. వంకలు నీటితో పారుతుండటం వల్ల ఇసుక సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో పలు నిర్మాణాలు చేపట్టిన వారికి పెద్ద సమస్యే వచ్చి పడింది. వీటితోపాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన వారికి సహితం గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిలో ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ఇసుక రీచ్‌లో నీటిపారుదల కారణంగా ఆన్లైన్ సిస్టం సహితం అం దుబాటులో లేకుండా పోయింది. మధ్యలో కొన్ని రోజు లు కొన్ని రీచ్‌లు పని చేసినా అది కొంత వరకే పరిమితం కావడంతో ఇసుక సమస్య తీరడం లేదు.
జిల్లాలో 11 రీచ్‌లు ఉంటే..
జిల్లా వ్యాప్తంగా ఇసుక సరఫరాకు ప్రత్యేక వాగులను గుర్తించారు. గత రెండు, మూడేళ్లకు పైగా ఇక్కడి నుంచే ఇసుక రవాణా జరుగుతుంది. వీటిలో తూం కుంట, రామమ్మపేట, కమాలుద్దీన్‌పూర్, చిలకటోనిపల్లి, కర్వెన, దుప్పల్లి, వీరరాఘవాపురం, అప్పరాల, రేచింతల, వై శాఖాపురం తదితర ప్రాంతాల్లోని వాగులను ఇసుక రీచ్‌లుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇంత ఇబ్బంది వరుసగా ఎప్పుడు గతంలో తలెత్తలేదు. ఇలా గుర్తించిన రీచ్‌ల నుంచి ప్రస్తుతం ఇసుక తీయడం ఇబ్బందిగా మారింది. వీటిలో నిత్యం నీరు పారుతుండటం వల్ల తలనొప్పిగా మారింది. కొన్ని చోట్ల వర్షాలు తగ్గినప్పుడు మూడు, నాలుగు రీచ్‌లను అనుమతించినా.. మళ్లీ వర్షాలు రావడంతో అక్కడ కూడా పని సాఫీగా సాగడం లేదు.
రెండు నెలలుగా అవస్థలు..
జిల్లాలో రెండు నెలలకు పైగా ఇసుక సమస్య వినియోగదారులను ఇరకాటంలోకి నెట్టింది. ఇసుక లేనిది ఏ నిర్మాణం ముందుకు సాగదు. ప్రభుత్వ, ప్రైవేట్‌పరంగా నడుస్తున్న పనులన్నింటికీ ఆటంకం ఏర్పడింది. కొంత వరకు ప్రభుత్వ పనులకు నడిపించుకుంటున్నా.. ప్రైవేట్ పనులకు ఇసుక బంగారం అయింది. దీంతో పనులు మొదలు పెట్టుకున్న యజమానులు లబోదిబో మంటున్నారు. రీచ్‌ల్లో ఇసుక పనులు జరుగుతాయనుకునే క్రమంలో మళ్లీ వర్షం రావడంతో అవస్థలు ఎదురవుతున్నాయి. ఇప్పటికీ అనేక వాగుల్లో నీరు ప్రవహిస్తుండడంతో ఇసుక సమస్య నిర్మాణదారులను వెంటాడుతుంది.
ఇందిరమ్మ నిర్మాణాలకు ఇక్కట్లు..
జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక సమస్య జఠిలంగానే ఉంది. ఈ ఇండ్లకు ఉచితంగా అని ప్రభుత్వం చెప్పినా.. చాలా మందికి ఆ ఉచి త ఇసుక అందడం లేదు. నిరుపేదలకు ఉచితంగా అవకాశం కల్పించినా లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతున్నది.
ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ముందుగా ప్రతి మండలంలో ఒక ఎంపిక చేసిన గ్రామాన్ని గుర్తించి పైలట్ ప్రాజెక్టుగా జనవరి 26న ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. ఇలా ప్రత్యేకంగా గుర్తించిన 15 గ్రామాల్లోనే దాదాపు 1250 ఇండ్ల వరకు మంజూరయ్యాయి. ఇవి కాకుండా అసెంబ్లీ స్థా యిలో మంజురైన దాదాపు 6 వేల ఇందిరమ్మ ఇండ్లను ప్రతి గ్రామానికి అందించేలా మంజూరులు ఇచ్చి ఉన్నారు. అయితే.. ప్రారంభంలో నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాకపోవడం.. ఆలస్యంగా కొంత మంది పనులు మొదలు పెట్టినప్పటికీ ప్రస్తుతం ఇసుక సమస్యతో ఇందిరమ్మ లబ్ధిదారులు సహితం ఊగిసలాడుతున్నారు.
అడ్డదారిలో రూ. 5 వేలు..
గత కొంతకాలంగా ఇసుక ఇబ్బందులు తలెత్తడం వల్ల జిల్లాలోని కొందరు ట్రాక్టర్ల యజమానులు, మధ్య దళారీలు పెట్రేగిపోతున్నారు. ఇసుక అత్యవసరమైన క్రమంలో అడ్డదారిలో తెచ్చిన ఇసుకకు నాలుగు వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలాం టి సందర్భాల కోసం ఎదురు చూసే ఇసుక అక్రమ రవాణ ముఠా వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నది. జిల్లాలోని కొన్ని చోట్ల ఇలా అక్రమంగా నడుస్తున్న ఈ దందాను కొన్ని ప్రాంతాల్లో పోలీసు అధికారులు పట్టుకుంటున్నారు. మరికొన్ని చోట్ల చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే పోలీసులు పట్టుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇసుక వ్యాపారం చేసే దళారులు కొందరు అధికారుల కనుసన్నల్లోనే ఈ ఆక్రమ దందాకు తెరలేపారన్న విమర్శలు సైతం ఉన్నాయి.
ఇసుక రీచ్‌లు ప్రారంభమవుతాయి
ఇటీవల భారీగా వర్షాలు రావడంతో ఇసుక రీచ్‌లు పని చేయలేదు. వరుసగా వచ్చిన వానలతోనే సమస్య ఏర్పడింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇ సుకను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ట్రాక్టర్ అద్దె చెల్లించిన వారికి ఇసుకను పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లా మైనింగ్ అధికారులు త్వరలోనే అవకాశం ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను అందించేలా చూస్తాం. ఈ సమస్యను త్వరలోనే అధిగమిస్తాం.
-విటోభా, డీఈ, హౌసింగ్ శాఖ, వనపర్తి జిల్లా