జడ్చర్ల టౌన్, నవంబర్ 8 : జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ శివారులో కావలి యాదయ్య రైతు పొలంలోని ఇంట్లో ఒకేచోట 7పాములు లభ్యమయ్యాయి. నసుర్లాబాద్కు చెందిన యాదయ్య గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో ఇల్లు కట్టుకున్నాడు. శనివారం ఇంటి సమీపంలో ఓ పామును గుర్తించిన యాదయ్య జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ సమన్వకర్త డాక్టర్ సదాశివయ్యకు సమాచారమిచ్చాడు. సదాశివయ్య తన శిష్యులు రవీందర్, భరత్ తో కలిసి పరిశీలించారు.
బండ కింద ఒక్కొక్కటిగా 7 వానకోయిల (బాండెడ్రేసర్) పాములు బయటకి రా గా, పట్టుకున్నారు. అర్జరోజైన ఫెసియోలేట అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ పాములు కొలుబ్రిడే జాతికి చెందినవని సదాశివయ్య తెలిపారు. ఈ పాములు విషరహిత సర్పాలని, ఈ జాతికి చెందిన పాములు రెండు కలిసి ఉంటాయని, అంతకంటే ఎక్కువగా కలిసి ఉండటం అరుదని తెలిపారు. ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు ఇలా ఒకే ప్రదేశంలో ఉండే అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. స్వాధీనం చేసుకున్న పాములను బొటానికల్ గార్డెన్లో భద్రపరిచినట్లు వెల్లడించారు.