కల్వకుర్తి, ఏప్రిల్ 25 : మొక్కజొన్న అమ్ముకోవడం రైతుకు గగనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామగ్రామాన కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ పాలనలో మండలానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే మహా గొప్ప.. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన మక్కను అమ్ముకునేదుకు రైతులు నానా పాట్లు పడ్తున్నారు. గన్నీ బ్యాగుల నుంచి ధాన్యం అమ్ముకునే వరకు రైతులు కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు. మండే ఎండల్లో మొక్కజొన్న ధాన్యం అమ్ముకునేందుకు పడిగాపులు గాస్తున్నారు.
కల్వకుర్తి పీఏసీసీఎస్ వద్ద
కల్వకుర్తి మండలానికి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ధాన్యం విక్రయించేందుకు రైతులు తమ వివరాలను బయోమెట్రిక్ చేయించుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ అయిన అనంతరం రైతులు తీసుకొచ్చిన మక్కను అధికారులు దించుకుంటారు. కాకపోతే బయోమెట్రిక్ రైతులకు తలనొప్పిగా మారింది. కల్వకుర్తి పీఏసీసీఎస్ వద్దకు తమ వివరాలు నమోదు చేయించుకునేందుకు మొక్కజొన్న రైతులు శనివారం ఉదయం 8 గంటలకు వచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా సర్వర్ పనిచేయలేదు. అప్పటి వరకు వందల మంది రైతులు పీఏసీసీఎస్ వద్ద పడిగాపులు కాశారు. సాయంత్రం నుంచి బయోమెట్రిక్ సర్వర్ పని చే యడం ప్రారంభించింది. ఒక్కో రైతు వివరాలు నమోదు చేయడానికి దాదాపు 15 నిమిషాలకుపై గా సమయం పట్టింది. రైతులు తిండి తిప్పలు లేకుండా ఎదు రు చూడటం తప్పా గత్యంతరం లేని పరిస్థితి రైతులకు నెలకొన్నది.
1.50 లక్షల కరాల్లో సాగు
నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగిలో 1.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం వరి వేయొద్దని సూచించిన నేపథ్యంలో రైతులు మొక్కజొన్నపై దృష్టి సారించడంతో సాగు గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం ఉచిత సలహా అయితే ఇచ్చింది కానీ.. ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోలేదని తెలుస్తోంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు మొక్కజొన్న అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేసిన నేపథ్యంలో ఎకరాకు సరాసరిగా 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొత్తంగా 52 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వస్తున్న క్రమంలో ఆ దిశగా కొనుగోలుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయకపోడంతో ఈ దుస్థితి దాపురించింది.
గన్నీ బ్యాగుల కొరత
ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసినప్పటికీ రైతులకు అవసరమయ్యే గన్నీ బ్యాగులను అందించడంతో పూర్తిస్థాయిలో విఫలం చెందిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాగుల నుంచి ధాన్యం విక్రయించే వరకు రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం రైతులు పీఏసీసీఎస్ల వద్దకు వచ్చి గన్నీ బ్యాగుల కోసం తిరుగుతున్నారు. చచ్చీ చెడి గన్నీ బ్యాగులు దొరికిచ్చుకుంటే.. వాటిని కొనుగోలు కేంద్రం వరకు తరలించడం, బయోమెట్రిక్ చేయించుకోవడం మాటల్లో చెప్పలేని కష్టంగా మారింది. కొనుగోలు కేంద్రాల సంఖ్య ఎక్కువగా లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది.
బహిరంగ మార్కెట్లో..
మొక్కజొన్న బహిరంగ మార్కెట్లో రూ.1,600లకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రూ.2,400. బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటే రైతు క్వింటాకు రూ.800 నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు వస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగుల కొరత, ట్రాన్స్పోర్ట్ తిప్పలు, బయోమెట్రిక్ కష్టాలు వెంటాడుతోన్నాయి. దీనికి తోడు ప్రభుత్వం మరో తిరకాసు విధించింది. ఎకరాకు 26 క్వింటాళ్ల మక్కను కొనుగోలు చేస్తుండటంతో మిగిలింది ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. సరాసరిన ఎకరాకు 35 నుంచి 45 క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వచ్చింది.
ప్రభుత్వం 26 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే మిగతా 10, 15 క్వింటాళ్ల ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి మొక్కజొన్న కోనాలన్న ఉద్దేశం లేదు.. అందుకే ఇలాంటి తిరకాసు వ్యవహారాలు చేస్తుందని రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచకుండా రైతులను ఇబ్బందులను పెట్టడం చూస్తుంటే.. రైతులు బహిరంగ మార్కెట్లో ఏదో ఒక ధరకు అమ్ముకోవాలనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.