నారాయణపేట, ఆగస్టు 2 : నారాయణపేట జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కందుకూరు గ్రామ శివారులోని తేళ్ల దేవత ఆలయంలో మంగళవారం భక్తులు భక్తి శ్రద్ధలతో తేళ్ల పంచమి వేడుకలను జరుపుకొన్నారు. నాగుల పంచమి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పుట్ట వద్దకు వెళ్లి నాగుల విగ్రహాలకు పూజలు చేసి పాలు పోయడం చూస్తుంటాం. కానీ, ఈ గ్రామ శివారులోని కొండపై గల ఆలయంలో తేళ్ల రూపంలో విగ్రహాలకు పాలు పోసి నాగుల చవితి మాదిరిగానే తేళ్ల పంచమి జరుపడం ఆనవాయితీ.
తేళ్ల పంచమి సందర్భంగా కందుకూరు తేళ్ల గుట్ట వద్దకు వచ్చిన భక్తులు గుట్టపై రాళ్ల కింద ఉన్న తేళ్లను చేతితో పట్టుకొని ఒంటిపై, ముఖంపై, నాలుకపై వేసుకొని యవకులు, చిన్నారులు విన్యాసాలు చేశారు. తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల నుంచి జనం పెద్ద ఎత్తున ఆలయానికి బారులు తీరడంతో కందుకూరు గేటు వద్ద జనంతో రద్దీగా మారింది.