ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మరో వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానుండగా.. విద్యాసంస్థలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ పరీక్ష చేయించడంలో ఆసక్తి చూపడం లేదు. ఐదు జిల్లాల్లో కలిపి మొత్తం 1383 స్కూల్ బస్సులు ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 335 బస్సులకే ఎఫ్‌సీ(ఫిట్నెస్ సర్టిఫికెట్) రెన్యూవల్ చేయించాయి. ఇంకా 1048 బస్సులకు చేయిం చాల్సి ఉన్నది. ఈ పరీక్షలు చేయించకుండా విద్యార్థుల భద్రతపై, జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. అయితే ఈనెల 12లోగా బస్సులన్నింటికీ సామర్థ్య పరీక్షలు చేయించాలని రవాణా శాఖాధికారులు సూచిస్తున్నారు.
– మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 3
స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ) రెన్యూవల్ చేయించుకునే విషయంలో ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల యాజమాన్యాలు నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 75శాతం స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1383 స్కూల్ బస్సులు ఉన్నాయి. కాగా వాటిలో ఇప్పటి వరకు కేవలం 335 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యూవల్ చేయించారు. 1048 బస్సులకు ఇంతవరకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యూవల్ చేయలేదు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి వారం రోజుల వ్యవధి ఉన్నది. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలు ఇబ్బ డి ముబ్బడిగా ప్రకటనలు చేస్తూ విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గల్లిగల్లి తిరుగుతూ, తమ విద్యా సంస్థల గురించి ప్రచారం చేస్తున్నాయి. విద్య పేరు చెప్పి రూ.లక్షలు దండుకోవాలన్న ధ్యాస తప్పా విద్యార్థులకు తగిన భద్రత కల్పించాలన్న ఆలోచన విద్యా సంస్థల యాజమాన్యాలకు లేదన్న విమర్శలున్నాయి.
ఇదే నేపథ్యంలో పిల్లల చదువుల కోసం ఎంత ఖర్చుకైనా తల్లిదండ్రులు వెనుకాడటం లేదు. విద్యా సంస్థల్లో వసతులు, బోధన సిబ్బంది గురించి ఆరా తీస్తారు. కానీ వాటికంటే ముఖ్యమైన విషయం రవాణా సౌకర్యం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. పాఠశాలల హంగులు, ఆర్భాటాలు చూసి మోసపోయే ప్రమాదముంది.
గతంలో ఎన్నో ప్రమాదాలు
జిల్లాలో స్కూల్ బస్సుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అనేక కార్పోరేటు, ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో సీట్లు చిరిగిపోయి, దుమ్ము ధూళి పేరుకుపోయి, ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో మందులున్నా లేకపోయినా.. ఉన్న మందులు కాస్తా గడువు దాటిపోయినా పట్టించుకోకుండా లాభార్జనే ధ్యేయంగా చూసుకుంటున్నాయి విద్యాసంస్థల యాజమాన్యాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది పాఠశాలల్లో ఇదే పరిస్థితి.
డబ్బు లు వసూళ్లు చే యడంలో ఉన్న శ్రద్ధ ప్రమాణాలు పా టించడంలో చూపించ డం లేదు. వీరికి ఇటు విద్యాశాఖాధికారులు, అటు రవాణా శాఖాధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిట్నెస్ లేని కారణంగా గతంలో ఎన్నోచోట్ల విద్యార్థులు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. వి ద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చే విద్యా సంస్థల బస్సు ఫిట్నెస్, అనుభవజ్ఞులైన డ్రైవర్లు, నిబంధనల మేరకు వాహనం ఉందా? అన్నది తల్లిదండ్రులు చూడాలి. బస్సు డ్రైవర్లు బాధ్యతాయుతంగా విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చుతున్నారా? అనే అంశాలను పాఠశాల యాజమాన్యం పరిగణనలోకి తీసుకోవాలి.
ఉమ్మడి జిల్లాలో ఫిట్నెస్ ఇలా..
మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 472 బస్సులు ఉండగా వాటిలో 107 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొం దాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 273 బస్సులకు కేవలం 50 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాయి. జోగుళాంబ-గద్వాల జిల్లాలో 244 బస్సులకు గానూ 53 బస్సులకు, వనపర్తి జిల్లాలో 242 బస్సులకు 70, నారాయణపేట జిల్లాలో 152 బస్సులకు గానూ 55 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయి.
ఫిట్నెస్ రూల్స్..
15 సంవత్సరాలు నిండిన వాహనాలను స్టూడెంట్స్ రవాణాకు ఉపయోగించకూడదు. స్కూల్ బస్సు పూర్తి కండిషన్లో ఉండాలి. విద్యా సంస్థ పేరు, సెల్‌ఫోన్, ల్యాండ్ ఫోన్ నెంబరు, పూర్తి అడ్రస్ బస్సు ఎడమవైపు, ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి. ప్రతి విద్యాసంస్థ యాజమాన్యం డ్రైవర్ ఆరోగ్య పట్టిక నిర్వహించాలి. డ్రైవర్ షుగర్, బీపీ, కంటిచూపు వంటి ప్రాథమిక పరీక్షలను ప్రతి 3 నెలలకోసారి చేయించాలి. డ్రైవర్‌కు 5 ఏండ్ల అనుభవం తప్పనిసరి ఉండాలి.
ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు కూర్చునేందుకు అనువుగా సీట్లు ఉన్నాయా.. లేవా? చూసుకోవాలి. అత్యవసర ద్వారం (ఎమెర్జెన్సీ ఎగ్జిట్) ఉండాలి. దానిపై స్పష్టంగా అత్యవసర ద్వారం అని రాసి ఉండాలి. బస్సుకు సంబంధించిన వైపర్స్, విండ్ స్క్రీన్, పార్కింగ్ లైట్స్, లైటింగ్స్ ఉండాలి. బస్సు టైర్లు కూడా కండిషన్‌గా ఉండా లి. ప్రతి బస్సులో మంటలు ఆర్పే పరికరాలు ఉండాలి. డ్రైవర్‌కు విద్యార్థులు బస్సు ఎక్కడం, దిగడం స్పష్టంగా కన్పించే విధంగా అద్దాలు అమర్చుకోవాలి. ప్రతి బస్సులో అటెండర్ ఉండాలి. బస్సులో ప్రయాణిస్తున్న స్టూడెంట్స్ పట్టిక ఉండాలి.
బస్సులో స్టూడెంట్స్ బ్యాగులు పెట్టుకొనే విధంగా అరలు ఏర్పాటు చేయాలి. కిటికీలకు మధ్యలో లోహపు కడ్డీలు కచ్చితంగా ఉండాలి. ఫుట్‌బోర్డుపై మొదటి మెట్టు భూమికి 325 మిల్లీమీటర్ల ఎత్తు మించకుండా చూడాలి. అన్ని మెట్లు జారకుండా లోహంతో నిర్మించాలి. బస్సులో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగితే, తక్షణమే మంటలు అర్పేందుకు కార్బన్‌డై ఆక్సైడ్ (సీవో2) రసాయనం నింపిన ఎరుపు రంగుతో కూడిన సిలిండర్ డ్రైవర్‌కు అందుబాటులో ఉండాలి. డ్రైవర్ సీటుకు వెనుకాల విధిగా ప్రథమ చికిత్స పెట్టె (ఫస్ట్ ఎయిడ్ బాక్స్) ఉండాలి. అందులో అత్యవసర సమయంలో చికిత్స చేసేందుకు అనువైన 26 రకాల మందులు, గాయాలకు కట్టుకట్టడం కోసం దూది, బ్యాండెజ్ ఉండాలి. ముఖ్యంగా డ్రైవర్, క్లీనర్లు యూనిఫాం ధరించాలి. విధుల్లో మద్యం తాగరాదు.
యాజమాన్యాల బాధ్యతలు..
బస్సు డ్రైవర్, సహయకుడి ఫొటో, లైసెన్స్ వివరాలను అందరికీ తెలిసేలా బస్సు లోపల బోర్డు పెట్టించాలి. విద్యార్థులను ఎక్కించి, దింపేందుకు ప్రతి బస్సుకు ఒక సహాయకుడిని ఏర్పాటు చేయాలి. రోజూ బస్సు వెళ్లే మార్గాన్ని (రూట్ మ్యాప్) బస్సులో అతికించాలి. తప్పనిసరిగా బస్సులను పాఠశాల ఆవరణలోనే పార్కింగ్ చేయాలి.
బడులు తెరిచేలోగా ఫిట్నెస్ చేయించాలి
విద్యాసంస్థల ప్రారంభం ఈనెల 12లోగా బస్సుల న్నింటినీ సామర్థ్య పరీక్షలు చేయించాలి. ఈ విష యంలో రాజీపడే ప్రసక్తే లేదు. తనిఖీలు ముమ్మరం చేస్తాం. పట్టుబడితే వా హనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానా విధిస్తాం. పరీక్షలకు రాని బస్సులకు సంబంధించి యజమానులకు నోటీసులు పంపిస్తాం. తల్లిదండ్రులు సైతం కచ్చితంగా బడి బస్సు గురించి వాకబు చేయడంతో పాటు వాటి సమగ్ర వివరాలు సేకరించాకే విద్యార్థులను ఆయా పాఠశాలల్లో చేర్పించాలి. నిబంధనలు పాటించని పాఠశాలల్లో అడ్మిషన్లు పొందకూడదు.
– కిషన్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఉప రవాణాశాఖ అధికారి
Pp