ఖిల్లాఘణపురం, ఆగస్టు 23 : మండలంలో 16 రైస్‌మిల్లుల వ్యవహారం రోజురోజుకూ చర్చనీయాంశంగా మారుతోంది. ప్రభుత్వ ధాన్యం నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియ, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖిల్లాఘణపురం మండలమే కాకుండా జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న రైస్‌మిల్లుల పరిస్థితి ఇదేనని రైతులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని రైసు మిల్లుల అవినీతిలో వనపర్తి జిల్లా రెండోస్థానంలో ఉందని విశ్వసనీయ సమాచారం. ఖిల్లాఘణపురం మండలంలో 6 రైస్ మిల్లులకే రూ.100కోట్లు ప్రజాధనం లూటీ అయినప్పటికీ మిగతా 8 రైస్‌మిల్లు కూడా తనిఖీలు నిర్వహిస్తే ఇంకా ఎంత మొత్తం ప్రజాధనం దోచుకున్నారో అనే విషయం బట్టబయలవుతుంది.
కొంతమంది రైస్‌మిల్లుల యజమానులు తమ వివరాలు బయటికి రాకుండా పైరవీలు కొనసాగిస్తున్నారు. మరి కొంతమంది బియ్యం కొని అందులో నిల్వ చేసి ప్రభుత్వానికి అమ్మే ఆలోచనలో ఉన్నారు. ఏదిఏమైనా రైస్‌మిల్లుల మాయాజాలం పెద్ద మాఫియాగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వం సీజ్ చేసినట్లు పేర్కొంటున్న ఓ రైస్‌మిల్లులోనూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు రావడం కలకలం రేపుతుంది. ఈ వ్యవహరంపై సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో 16 రైస్‌మిల్లులు ఉన్నప్పటికీ వాటిలో సగానికి పైగా మిల్లులపై ఏదో ఒక సమయంలో కేసులు, ఆరోపణలు రావడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. రైస్‌మిల్లుల ఏర్పాటు తర్వాత కొందరు యజమానులు భారీగా ఆస్తులు కూడబెట్టారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే మిల్లింగ్ వ్యాపారంలో లాభాలు అంతగా లేవని, తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొందరు మిల్లర్లు బయటికి చెబుతున్నప్పటికీ మరోవైపు కోట్ల రూపాయల వ్యవహారాలు సాగుతున్నాయనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారా యి. కేసులు నమోదైన సందర్భాల్లో కొద్ది రోజుల పాటు మిల్లులు మూసివేసి , అనంతరం న్యాయస్థాయాలను ఆశ్రయించి బెయిల్ పొందిన తర్వాత మళ్లీ యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి వ్యవహరాలపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి తప్పు చేసినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై కఠిన చ్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని సరైన సమయంలో రైస్ మిల్లులు తీసుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. వచ్చే సీజన్లో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని రైతులు కోరుతున్నారు. అవసరమైన మేరకు గోదాంలు, నిల్వ సదుపాయాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో తూకాల్లో తేడాలు, తరుగు పేరుతో అధికంగా ధాన్యం తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒక్కో సంచికి పెద్ద మొత్తంలో తరుగు తీసుకుంటున్నారని కొందరు రైతులు వాపోతున్నారు. అలాగే ధాన్యంలో తేమ శాతం, నాణ్యత పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. రైతులు కష్టపడి పండించిన పంటకు న్యాయమైన ధర, పారదర్శకమైన తూకం, సకాలంలో కొనుగోలు జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
రైస్ మిల్లుల కార్యకలాపాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వ ధాన్యం నిల్వలు, మిల్లింగ్ రికార్డులు , తూకాలు, తరుగు, ధాన్యం తరలింపు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడే వారికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ధాన్యం కొనుగోలు సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసి, రైస్ మిల్లర్లు , అధికారులు, రైతుల మధ్య సమన్వయంతో పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ ధనం లూ టీ చేసి కోట్లల్లో వ్యత్యాసాలు చూపడం చట్టరీత్యా నేరమని ఇందుకు సంబంధించిన తప్పు చేసిన మిల్లుల ప్రతి య జమానిపై కేసులునమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఈ తనిఖీలు ఎన్పోర్స్మెంట్ అదికారులు నిర్వహిస్తారు. వారి సమాచారం మేరకు తాము అక్కడికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేయించే బాధ్యత మాపై ఉంటుంది. విడతల వారీగా అన్ని మిల్లులు తనిఖీ చేస్తాం.
– ఆంజనేయులు, సివిల్ సప్లయ్ డీఎం