Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఐడీవోసీ సమావేశపు హాల్ నందు ఎస్సి, ఎస్టీ, సభ్యులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలతో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల జాతుల వారితో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మెన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జోగులాంబ గద్వాల జిల్లాలో దళితులపై దాడులు జరుగుతున్నప్పటికీ, దాడులకు పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బక్కి వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడుతున్న వారితో పాటు వారికి వత్తాసు పలుకుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రతినెల 30వ తేదీన గ్రామాల్లో పౌరహక్కుల సమావేశం నిర్వహించి, అందులో అందర్నీ భాగస్వామ్యం చేయాలన్నారు.
రాజోలి ఎస్సై దళితుల పట్ల వివక్ష చూపుతున్నాడని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీకి గ్రామస్తులు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఎస్సై యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ గ్రామస్తులపై తప్పుడు కేసులు నమోదు చేశాడని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఎస్పీ శ్రీనివాసరావుకు కమిషన్ ఆదేశించింది.
అందుకు స్పందించిన ఎస్పీ విచారణ అధికారిగా డీఎస్పీని నియమించి నివేదిక వచ్చిన తర్వాత ఎస్సైపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని కమిషన్‌కు తెలియజేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలు సేకరించారా అని కలెక్టర్‌ను కమిషన్ చైర్మన్ వెంకటయ్య ప్రశ్నించారు. దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి కుల వివక్షతను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. దళితులకు సంబంధించి సబ్ ప్లాన్ నిధులను వారి అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలని, ఇతర వాటికి ఖర్చు చేస్తే అటువంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం దళిత సంఘాలు, ప్రజా సంఘాలు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రవీణ్ కుమార్, రాంబాబు, శంకర్, నీలాదేవి, లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ టి శ్రీనివాస్, అదనపు కలెక్టర్ జెడి లక్ష్మి నారాయణ, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.