నాగర్‌కర్నూల్, జూన్ 22 : రాష్ట్రంలో ప్రజాపాలన లేదని, రాక్షసపాలన నడుస్తున్నదని మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీ రం హర్షవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు మ హిళ ఈశ్వరమ్మను వారు పరామర్శించి రూ.1.50లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఈశ్వరమ్మపై జరిగిన పాశవిక దాడి చాలా బాధకరమన్నారు.
ఈ విషయంపై సర్కారు వెంటనే స్పందించాలన్నారు. మహిళా వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అని గొప్పలు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలనకు తెరలేపిందని దుయ్యబట్టారు. మాటల్లో చెప్పలేని, ప్రజలకు చూపలేని రీతిలో అతి నీచంగా క్రూరమృగాల మాదిరిగా మహిళపై దాడి చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు బతకలేని పరిస్థితుల్లో ఉన్నారని, కొన్ని రోజులుగా రాష్ట్రంలో అసాంఘిక ఘటనలు.. చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదన్నారు. తూతూమంత్రంగా స్పందించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ర్టాన్ని రావణకాష్టంగా మార్చి పాలన సాగిస్తున్నారన్నారు.
ఈశ్వరమ్మపై దాడి అనంతరం ఆమెకు మెరుగైన వైద్యం అందించడంలో వైద్యులు సైతం విఫలమయ్యారన్నా రు. మహిళా డాక్టర్‌తో వైద్య సేవలు అందించకుండా డ్యూటీ డాక్టర్లతో వైద్యం చేయిస్తున్నారని విమర్శించా రు. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ముగ్గురు పిల్లల చదువుకు బాధ్యత తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. మర్మాంగంపై కారం చల్లి డీజిల్ పోసి పాశవిక దాడి చేసిన నిందితులను పోలీస్ స్టేషన్లో ఉంచి కొత్త అల్లుడికి మర్యాదలు చేసినట్లు చేస్తున్నారని, వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, సీఎం వెంటనే సమీ క్ష నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి, డీజీపీలతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు పార్టీ తరఫున పోరాడుతామన్నారు. ఒక దవాఖానలో కేవలం నలుగురు లేడీ డాక్టర్లే ఉండడం ఏమిటని ప్రశ్నించారు. బాధిత మహిళ తనపై దాడి చేసిన వారి పేర్లను స్వయంగా చెప్పినా.. వారిని కాదని వేరే పేర్లతో కేసులు పెట్టడం పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనమన్నారు. నిజంగా పేదవారిపై అభిమానం ఉం టే ఇంతటి ఘాతుకానికి పాల్పడిన మరో ముగ్గురిని సా యంత్రానికల్లా అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. కేసులు పెడితే మళ్లీ బయటకొచ్చి తమను చంపుతారని బాధిత కుటుంబసభ్యులు భయపడుతున్నారన్నారు. సుమోటో కింద కేసు నమోదు చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.