లింగాల, ఏప్రిల్ 1: తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి గాంచిన సలేశ్వరం లింగమయ్య దైవ దర్శనం కోసం నల్లమల బుధవారం జనసంద్రంతో నిండిపోయింది. రాళ్లు, రప్పలు, గుట్టలు దాటుతూ వస్తున్నాం లింగమయ్య అంటూ శివనామ స్మరణంతో నల్లమల మార్మోగింది. మదినిండా లింగమయ్యను స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రా ష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా భక్తులు నల్లమల బాట పట్టారు. మండలంలోని నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో వెలసిన స లేశ్వరం లింగమయ్య దైవదర్శనానికి రెండు మార్గాల గుండా లక్షలాదిగా భక్తులు తరలి వస్త్తున్నారు.
లింగాలలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ముం దుగా ఆలయంలో సీతారాములను దర్శించుకొని అప్పాయిపల్లి మీదుగా గిరిజాగుండాల వరకు ప్రత్యేక వాహనాల్లో వెళ్లి అక్కడి నుంచి అభయారణ్యంలో కాలినడకన సలేశ్వర క్షేత్రానికి చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించి లింగమయ్య స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదే విధంగా అచ్చంపేట మీదుగా శ్రీశైలం వెళ్లే రోడ్డు మార్గంలోని ఫరహబాద్ నుంచి రాంపూర్, అప్పాపూర్ చెంచు పెంటల వరకు వాహనాలలో వెళ్లి అక్కడ నుంచి కాలినడకన వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.