అచ్చంపేట, జూన్ 28 : ప్రకృతిని అల్లుకున్న అద్భుత భూమి నల్లమల. చెట్లు, చేమలు, పక్షుల కిలకిల, పులుల గర్జనలు ఇలాంటి సహజ దృశ్యాలు ఎక్కడా కనిపించవు. ఇదే నల్లమల ప్రత్యేకత. ఇప్పు డు ఈ అడవి వన్యప్రాణుల కోసమే ఓ తాత్కా లిక విరామాన్ని ప్రకటించింది. వన్యప్రాణుల సంతానోత్సత్తికి అనుకూలంగా వాతావరణం మారుతుండడంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) అధికారులు జూలై 1నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పాటు పరహాబాద్, అక్కమహాదేవిగుహలు సఫారీ ప్యాకేజీ సేవలను నిలిపివేయనున్నారు. వానకాలం రావడంతో నల్లమల అడవి పచ్చదనంతో ఆకట్టుకుంటుంది. మొక్కలు, గడ్డి వృక్షావళి పెరిగి అడవి జీవులకు ఆహారం, ఆశ్రయం కల్పిస్తున్నాయి.
ఇది పులులు, చిరుతలు సహా వన్యప్రాణులకు జతకట్టే, సంతానోత్పత్తి చేసే ముఖ్యమైన కా లం. ఏటా ఈ మూడు నెలలపాటు పర్యాటకులను అడవిలోకి అనుమతించరు. అక్టోబర్ 1నుంచి మళ్లీ సఫారీ పునఃప్రారంభం అవుతుంది. యాత్రికులు అటవీప్రాంతంలోని అందాలు తిలకించేందుకు ప్రతిరోజు సఫారీ ప్యాకేజీ ద్వారా లోపలికివెళ్లి తిలకించేవారు. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రం, ఉమామహేశ్వరం, మద్దిమడుగు లాంటి పేరుగాంచిన ఆకట్టుకునే దైవక్షేత్రాలు ఉన్నందున పెద్దసంఖ్యలో యాత్రికులు, భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలోనే సఫారీ యాత్ర ద్వారా నల్లమల అందాలు తిలకించేందుకు ఇష్టపడుతుంటారు.
ప్రస్తుతం నల్లమలలో వన్యప్రాణుల సంతానోత్పత్తికి అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు. అటవీలోకి జనసంచారం లేకుండా అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు వన్యప్రాణులకు ఎలాంటి అటంకాలు లేకుండా స్వేచ్ఛగా విహరించడంతోపాటు తమ సంతానొత్పత్తిని పెంచేందుకు కావాల్సిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెంచనున్నారు. ఈ మూడు నెలల పాటు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా నల్లమలలోకి ప్రవేశించేవారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయనున్నారు.
పక్షి సంపద : నల్లమలలో సుమారు 350 రకాల పక్షి జాతులు నివాసం ఉంటున్నాయి. వీటిలో 20 రకాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఫేసరిఫామ్ కుటుంబానికి చెందిన పక్షులైన మైనాలు, కాకులు, పిచుకలు, రాబిన్స్ ఈప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. కొంగలు, బుట్టచప్పనాతి, బుల్బుల్, ఫ్లెక్యాచెర్ మొదలైన జాతులను చూడవచ్చు. ఆకుపచ్చ పావురాలు, ప్రూట్ బ్యాక్ (అతిచిన్న గబ్బిలాలు), ప్రమాదకరమైన సాలె పురుగులు(జెమ్స్ స్పైడర్) ఇక్కడ ఉన్నాయి. అంతరించిపోతున్న బుట్టమేక పిట్టకు రోళ్లపాడు వన్యప్రాణి కనిపిస్తుంది.
నల్లమల అభయారణ్యంలో పెద్దపులుల రక్షిత ఆవాసాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా 104 నుంచి 106 రోజుల గర్భధారణ సమయం తరువాత ఆడపులి 1 నుంచి 4 పిల్లలకు జన్మనిస్తుంది. పొడవైన గడ్డీ దట్టంగా ఉన్న ప్రదేశంలో, గుహలవంటి ఏకాంత ప్రదేశాలు లేదా దట్టమైన పొదలలో పిల్లలను ప్రసవిస్తుంది. పెద్దపులులు ఆహార గొలుసునకు ఎగువన ఉంటాయి. పెద్దపులులు జింకలు, ఇతర శాఖాహార జంతువుల జనాభాను నియంత్రణలో ఉంచుతాయి. విస్తారమైన, దట్టమైన అటవీప్రాంతం పెద్దపులుల సంరక్షణకు ఉపయోగపడుతాయి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంగా ఏటీఆర్ గుర్తింపు సాధించింది. నల్లమలలో ప్రతి ఏడాది వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.
నల్లమల వన్యప్రాణుల నివాసానికి అనుకూలంగా మారడంతో నల్లమలలో కొత్తగా అడవిదున్న కూడా ఇటీవల కనిపిం చింది. ఇటీవల నల్లమలలో సఫారీ యాత్రికులకు పులులు అనేక సార్లు నేరుగా కనిపించాయి. నల్లమలలో వన్యప్రాణులకు వాతావరణం అనుకూలంగా మారడంతో వన్యప్రాణులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. నల్లమల 2,611.39 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉండగా అందులో 2,166.37 చదరపు కి.మీ అభయారణ్యం, 445.02 చదరపు కి.మీ బఫర్ జోన్‌గా ఉన్నది. అటవీశాఖ అధికారుల లెక్కల ప్రకారం నల్లమలలో 30 పెద్దపులులు, 6 పిల్లలు, 165 చిరుతలు, 2600పైగా ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు ఇతర వన్యప్రాణులు ఉన్నాయి.
వన్యప్రాణుల సంతానోత్సత్తి కోసం ప్రతి ఏడాది మాదిరిగా ఈ సారి కూడా నల్లమలలో మూడు నెలల పాటు సఫారీ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. జూలై 1నుంచి సెప్టెంబర్ 30 వరకు యాత్రికులను నల్లమలలోకి అనుమతించడం లేదు. ఈ మూడు నెలలు పెద్దపులి జతకట్టే రోజులతోపాటు ఇతర అనేక వన్యప్రాణులు సంతానోత్పత్తికి అనుకూలమైన సమయం. పరహాబాద్ వ్యూపాయింట్, అక్కమహాదేవి గుహలు సఫారీ సేవలను నిలిపివేయనున్నాం. తిరిగి అక్టోబర్ 1నుంచి పునఃప్రారంభించడం జరుగుతుంది. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశాం. యాత్రికులు, స్థానికులు అటవీశాఖ అధికారులకు సహకారం అందించాలి.