దేవరకద్ర మీదుగా వెళ్లే ప్రయాణికుల నిరీక్షణకు తెర పడనున్నది. రూ.24.63 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆర్వోబీ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. నిత్యం వేలాది వాహనాలు వెళ్లే హైదరాబాద్-రాయిచూర్ రహదారిపై రైల్వేట్రాక్ ఉన్నది. వేరే దారి లేకపోవడంతో గేట్ పడితే తప్పని పరిస్థితుల్లో చాలా సమయం వేచిచూడాల్సి వచ్చేది. ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయేవి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆర్వోబీకి శ్రీకారం చుట్టారు. కొంతమంది అడ్డం కులు సృష్టించడంతో, కరోనా నేపథ్యంలో పనుల్లో జాప్యం జరిగింది. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పట్టు బట్టి నిధులు మంజూరు చేయించారు. అదే స్థాయిలో అధికారుల వెంటపడి పనులు పూర్తి చేయించారు. ప్రస్తుతం బీటీ పనులు కొనసాగుతున్నాయి. బ్రిడ్జి కింద సర్వీస్ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరున వంతెనను అట్టహాసంగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మహబూబ్‌నగర్/దేవరకద్ర, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఏప్రిల్ 16 : దేవరకద్రలో నిర్మిస్తున్న ఆర్వోబీ పనులు తుదిదశకు చేరుకున్నాయి. పట్టణం మీదుగా వాహనాల రాకపోకలు అధికంగా ఉండడంతోపాటు రైళ్ల రాకపోకల కారణంగా గేటు పడితే వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆర్వోబీ నిర్మించాలని కేంద్ర మంత్రులను ఢిల్లీకి వెళ్లి కలిసినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రజల కష్టాలను చూసి చలించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విషయాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించగా ఆర్వోబీ నిర్మాణానికి 2014లో రూ.24.63కోట్లు మంజూరు చేశారు. కాంట్రాక్ట్ పొంది పనులు చేసేందుకు కాంట్రాక్టర్ మందుకు రాకపోవడంతో ఒప్పందం రద్దు చేశారు. రీ ఎస్టిమేట్తో కొత్త టెండర్లను పిలిచి 2019లో నూతన కాంట్రాక్టర్‌కు ఆర్వోబీ పనులు అప్పగించారు. కాగా 2021 చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఒప్పందం కుదిరినా లాక్డౌన్ కారణంగా పనులు నిలిచిపోగా ప్రభుత్వం మరో ఆరునెలల గడువు పెంచి 2022 వరకు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా నిర్ణీత సమయంలో పనులు పూర్తికాకపోవడంతో 2022 డిసెంబర్ వరకు ప్రభుత్వం గడువును పొడిగించింది. ఎట్టకేలకు ఆర్వోబీ పనులు చివరి దశకు చేరడంతో ఈ నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్- రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారి కారణంగా ఈ రోడ్డుపై నిత్యం వేలసంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అదేవిధంగా ఈమార్గం గుండా రైలు వెళ్లినప్పుడు గేట్ పడడంతో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్వోబీ నిర్మాణం పూర్తయితే రైల్వే అధికారులు నిబంధన ప్రకారం ఆర్వోబీ ఉన్న స్థాలంలో రైల్వేగేటు మూసివేసి రాకపోకలు నిషేధిస్తారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుయ్యే అవకాశం ఉన్నది. బస్టాండ్ ఆర్వోబీకి మధ్యలో ఉండడంతో బస్సులు పైఓవర్ మీదుగా వెళ్లి రావాలంటే ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి రైల్వే అధికారులు ప్రస్తుతం ఉన్న గేట్‌ను మూయకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ రాక ముందు ఆర్వోబీ నిర్మాణానికి ఎవరూ ప్రయత్నించలేదు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వంతో మాట్లాడి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్వోబీని నిర్మిస్తున్నాం. రైల్వేశాఖతో మాట్లాడి పట్టాలపై బ్రిడ్జి కంప్లీట్ చేశాం. కరోనా వల్ల పనులు ఆలస్యమయ్యాయి. హైదరాబాద్-కర్ణాటక మధ్య పట్టణం ఉండటంతో ట్రాఫిక్ చాలా పెరిగింది. ఇదే ప్రధాన రహదారి కావడంతో వేలాది వాహనాలొస్తున్నాయి. త్వరలో ఆర్వోబీని ప్రారంభించి వాహనదారులకు అందుబాటులోకి తీసుకొస్తాం.
– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర