అలంపూర్ చౌరస్తా, అక్టోబర్ 16 : అలంపూర్ నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గస్థాయి పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో రోడ్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని గుర్తించి నూతన రహదారులు నిర్మించాలన్నారు. టెండర్ల పక్రియ పూర్తయినా ఇంత వరకు ఎందుకు పనులు ప్రారంభించలేదని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
విధులు నిర్వహిస్తున్నారా లేదా కాలయాపన చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. గతంలో చేసిన పనులకు గుత్తెదారుల బిల్లులు మంజూరు చేయాలన్నారు. మానవపాడు, ఉండవల్లి, అలంపూర్, ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోలి, అయిజ, ఎర్రవల్లి మండలాల్లో అస్తవ్యస్తంగా ఉన్న రహదారులపై నివేదిక తయారు చేయాలని సూచించారు. ప్రస్తుతానికి మరమ్మతులు చేయాలని అదేశించారు. టెండర్లు పూర్తయిన రోడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్, డీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.